సంక్రాంతికి విడుదల కావాల్సిన మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. 5 సినిమాల పోటీ కరెక్ట్ కాదని భావించి ఫిల్మ్ చాంబర్ పెద్దలు ఈగల్ చిత్ర నిర్మాతలతో సంప్రదింపులు జరిపి.. వాయిదా వేయించారు. అలాగే ఈగల్ ఎప్పుడు వచ్చిన సోలో రిలీజ్ ఉండేలా చూస్తామని కూడా మాటిచ్చారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 9న ఈగల్ విడుదల డేట్‌ని ప్రకటించారు. కానీ అదే డేట్‌కి మళ్లీ బీభత్సమైన పోటీ నెలకొంది. దీంతో ఈగల్ నిర్మాతలైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఫిల్మ్ చాంబర్‌కు మాట మీద నిలబడాలంటూ ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ ఇష్యూపై సోమవారం ఫిల్మ్ చాంబర్ పెద్దలు సమావేశమై.. ఈగల్ ఇష్యూని క్లియర్ చేశారు. ఈ సమావేశానంతరం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు మాట్లాడుతూ..
సంక్రాంతి సినిమాల బరిలో నుంచి చాంబర్ కోరగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీ. జీ. విశ్వప్రసాద్, వివేక్, హీరో రవితేజ ముందుకొచ్చి తమ రిలీజ్ డేట్‌ని ఫిబ్రవరి 9కి మార్చుకున్నారు. ఇప్పుడు అదే ఫిబ్రవరి 9కి ఊరుపేరు భైరవకోన వారు రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ముందు ఈ విషయం ఛాంబర్ నోటీస్‌కి రాలేదు.. వచ్చిన వెంటనే ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకరతో, రాజేష్‌తో మాట్లాడటం జరిగింది. వారు కూడా చాంబర్ వినతిని మన్నించి తమ డేట్‌ని ఒక వారం రోజులు అంటే 16 ఫిబ్రవరికి మార్చుకోవడం జరిగింది. సంక్రాంతి అప్పుడు చాంబర్ వినతిని మన్నించి తమ డేట్‌ని మార్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి, ఇప్పుడు కూడా తమ డేట్‌ని మార్చుకొని చాంబర్ వినితిని మన్నిస్తున్న ఏ కె ఎంటర్‌టైన్‌మెంట్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఇష్యూ క్లియర్ అయింది కాబట్టి.. ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న ఈగల్‌కి ఎక్కువ శాతం థియేటర్స్ వచ్చేలాగా చూడడం జరుగుతుంది. అదే డేట్‌కి యాత్ర 2 వాళ్ళు కూడా రిలీజ్ పెట్టుకున్నారు. పొలిటికల్ ఇష్యూస్ మీద డేట్ ముందే ఫిక్స్ చేసుకున్న కారణంగా.. వాళ్లు డేట్ మార్చు చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అదేవిధంగా ఒక తమిళ్ సినిమా రజనీకాంత్ గారు గెస్ట్ రోల్ చేసిన లాల్ సలామ్ కూడా రిలీజ్ అవుతుంది. ఇదే విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో చర్చించినప్పుడు పర్లేదండి మా సినిమాతో రెండు సినిమాలు రావడం పెద్ద ఇబ్బంది కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నిర్ణయానికి వారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఫిబ్రవరి 9కి ఈగల్ మేజర్ థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది.. అని చెప్పుకొచ్చారు.