ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ రాబోయే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. పార్టీలన్నీ ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇప్పటికే వైసీపీ అయితే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేసేసింది. ఇక నెక్ట్స్ టీడీపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఒకవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తూనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. రా.. కదలిరా.. పేరిట పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు.ఈ పర్యటన సాగిస్తూనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సైతం చంద్రబాబు పూర్తి చేస్తున్నారు.
ఫిబ్రవరి 4న తొలి జాబితా?
ఇప్పటికే తిరువూరు, గుడివాడ, మండపేట, పీలేరు, పత్తికొండ, అరకు, ఉరవకొండ వంటి చోట్ల బహిరంగ సభలు ముగిశాయి. ఈ ముగిసిన ప్రాంతాల్లో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైనట్టు సమాచారం. అయితే ఫిబ్రవరి 4వ తేదీన టీడీపీ తొలి జాబితా విడుదల కానుందని సమాచారం. ఇప్పటికే 35 మంది పేర్లతో జాబితా సిద్ధమైపోయిందట. దీనిలో భాగంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, ఎన్టీఆర్, కృష్ణా, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఉంటారని సమాచారం. ఇప్పటికే రా.. కదలిరా సభలో రెండు నియోజకవర్గాల పేర్లను చంద్రబాబు ప్రకటించేశారు. అలాగే మొదటి లిస్ట్‌లో ఉండే అభ్యర్థుల పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి.
మాట పడిన చంద్రబాబు..
ఇక తొలి జాబితాలో టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, గంటా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మకాయల చినరాజప్ప, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత / పరిటాల శ్రీరామ్, ఆనం రామనారాయణ రెడ్డి తదితర నేతలు ఉండవచ్చంటూ ప్రచారం జరుగుతోంది. మరికొందరి పేర్లు తెలియాల్సి ఉంది. టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపకం పూర్తి కాకముందే లిస్ట్ ఎలా విడుదల చేస్తారన్న సందేహమూ లేకపోలేదు. అసలే రెండు స్థానాలను ప్రకటించే చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదన్న మాట పడ్డారు. మరి ఫిబ్రవరి 4వ తేదీ లోపే ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తవుతుందా? అది పూర్తయ్యాకే చంద్రబాబు లిస్ట్ విడుదల చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.