రాజకీయాల్లో ఊసరవెల్లులు ఎందెందు వెదికినా.. అందందే ఉంటాయి. దీనికి ముఖ్య ఉదాహరణ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఈయన అవసరాల కోసం ఎటు పడితే అటు టర్న్ అవుతుంటారు. ఒకసారి బీజేపీతో దోస్తీ నై అంటారు.. ఆ తరువాత ఇండియా కూటమితో దోస్తీ అంటారు. ఇప్పుడు అదీ లేదు.. తిరిగి బీజేపీతో దోస్తీయే అంటున్నారు. ఇక 1994 నుంచి ఆయన తీసుకున్న ఫ్లిప్పులు మామూలు ఫ్లిప్పులు కాదు.. ఓ రేంజ్. గెలుపు అనేది ఎటుంటుందో నితీష్ కూడా అటే ఉంటారనడంలో సందేహం లేదు. నితీష్ సంగతి పక్కనబెడితే బీజేపీకి ఏమైంది. అయోధ్య రామమందిరం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే సగం సక్సెస్ అని చెప్పుకుంది.
బీజేపీకి కూటమి అవసరమా?
ఆ తరువాత రామ మందిరం నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించామని.. ఇక పొత్తు ఉన్నా లేకున్నా 2024 ఎన్నికల్లో విజయం తమదేనని.. గత ఎన్నికల్లో కంటే కూడా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని.. బీభత్సంగా సీట్లు గెలుచుకుంటామని బీజేపీ చెప్పింది. కాలరెగరేసింది.. అయోధ్య రామ మందిర నిర్మాణం మొత్తం ఘనతను తన నెత్తిమీదే వేసుకుంది. రామ నామ జపంతో పాటు మోదీ నామ జపం కూడా జరిగేలా బీజేపీ శ్రేణులు ప్రయత్నించి సక్సెస్ కూడా అయ్యాయి. ఇంత చేసి ఇక ఎన్నికల ప్రచారం కూడా అవసరం లేదని చెప్పుకొచ్చిన బీజేపీకి కూటమి అవసరమా? నిన్న మొన్నటి వరకూ మళ్లీ ప్రధాని అయ్యేంత సీన్ మోదీకి లేదు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన నితీశ్‌తో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నట్టు? అనేది ఆసక్తికరంగా మారింది.
2013లో ప్రధాని అభ్యర్థి తానేనన్న నితీష్..
నితీష్ ఎంతలా ఫ్లిప్ అవుతారో ఒక్కసారి 1994 నుంచి పరిశీలిస్తే.. 1994లో జనతాదళ్ నుంచి బయటకు వచ్చి జార్జ్ ఫెర్నాండేజ్‌తో కలిసి సమతా పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్డీఏలో చేరారు. 2013లో ఇంకేముంది తానే ప్రధాని అభ్యర్థినని ఫీలయ్యారు. కానీ అది జరగకపోవడంతో బీజేపీపై కావల్సినన్ని విమర్శలు గుప్పించి ఆ పార్టీకి దూరమయ్యారు. ఆ తరువాత 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి నితీష్ జత కట్టారు. 2017లో లాలూపై అవినీతి ఆరోపణలొచ్చాయని కూటమిని వదిలేశారు. ఆ తరువాత మళ్లీ కమలానికి దగ్గరయ్యారు. ఆ తరువాత కమలానికి దూరమై విపక్ష పార్టీలతో జత కట్టారు. ఇండియా కూటమి ఏర్పాటైన తర్వాత తిరిగి కూటమికి హ్యాండ్ ఇచ్చి మోదీ పంచన చేశారు. ఇలాంటి నీతి లేని నితీష్‌ను బీజేపీ అక్కున చేర్చుకుంటోంది. ఇప్పటి వరకూ ఈ సారి ఎన్నిక పక్కా తనదేనని ప్రగల్భాలు పలికిన బీజేపీకి నితీష్ అవసరమా? అనేది ఆసక్తికరంగా మారింది.