ఆంధ్రప్రదేశ్‌లో పోటీ అయితే వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేనల కూటమి మధ్యే. ఇప్పటికే ఈ మూడు పార్టీలు ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఇంకా దరఖాస్తులు స్వీకరించే పనిలోనే ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకూ టీడీపీ, జనసేన కూటమిలో కలుస్తుందంటూ టాక్ నడిచింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సైతం హస్తినకు బీజేపీ అధిష్టానం ఆహ్వానించిందని.. ఆయనతో పొత్తు గురించి మాట్లాడతారంటూ ప్రచారం పెద్ద ఎత్తునే జరిగింది. కానీ ఏపీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్టు క్లియర్‌గా తెలుస్తోంది.
ఇన్‌చార్జులను నియమించిన పురందేశ్వరి..
నిజానికి ఇప్పటికే జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. అయినా కూడా జనసేన, టీడీపీతో కలిసి వెళ్లడంతో బీజేపీ మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టడంతో బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధమైందని తెలుస్తోంది. రాష్ట్రంలో 25 జిల్లాలను 5 క్లస్టర్లుగా విభజించి, వాటికి పురందీశ్వరి ఇన్‌చార్జిలను నియమించారు. అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను సైతం నియమించారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదలుచుకోలేదని స్పష్టమవుతోంది. ఇది బీజేపీకి మంచి చేస్తుందో లేదో తెలియదు కానీ టీడీపీ, జనసేనలకైతే చాలా మంచి చేస్తుంది.
బీజేపీ ఎంత దూరంగా ఉంటే అంత బెటర్..
బీజేపీ తరుఫున నేతలు కూడా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శనివారం నాడు విశాఖ (ఉత్తరం) నియోజకవర్గంలో శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పూజలు చేసి మరీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నిజానికి బీజేపీ.. టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుంటే.. వీటికి కాస్త అండగా నిలుస్తున్న కమ్యూనిస్టులు దూరమవుతారు. అలాగే మైనార్టీలంతా వైసీపీ వైపు టర్న్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి బీజేపీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే అసలు పవన్ వచ్చే నెల 2, 3 తేదీల్లో ఢిల్లీకి వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మళ్లీ ఏమైనా బీజేపీ మనసు మార్చుకుంటుందా? అనే అనుమానాలు లేకపోలేదు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..