షర్మిలపై ఇంత దారుణమైన ఆరోపణలు జగన్‌కే చెల్లు..!
తనకు ఎదురొస్తే ఎవ్వరినీ వదలరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఆయనకు చెల్లి ఒక లెక్క. బాబాయి హత్య జరిగితే.. నిందితులను వెనుకేసుకొచ్చి.. న్యాయం కావాలంటూ రొడ్డెక్కిన బాబాయి కూతురినే నాడు వదల్లేదు ఈ వైసీపీ గ్యాంగ్. తండ్రిని హత్య చేస్తే మాత్రం తన పార్టీ ఎంపీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మెట్లుక్కుతుందా? అని పెద్ద ఎత్తున సునీతా రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేయించారు జగన్ రెడ్డి. మరి ఇప్పుడు సొంత చెల్లి అయినా సరే తనపై నేరుగానే మాటల దాడి చేస్తుంటే ఎలా ఊరుకుంటారు? సొంత మీడియా ఎలాగూ ఉంది. నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడే హోస్ట్‌లూ.. నేతలూ ఉన్నారు. డిబేట్లు పెట్టించేసి ఏకి పారేయదూ.. అదే జరిగింది. నీలి మీడియా సాక్షిగా షర్మిలపై అక్కసంతా వెళ్లగక్కేశారు.
పాదయాత్ర చేయించినప్పుడు చెప్పలేదే?
కొండా రాఘవరెడ్డి.. తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్సార్‌టీపీలో జాయిన్ అయ్యి పోటీకి సైతం సిద్ధపడిన వ్యక్తి. వైఎస్సార్ అభిమానినంటూ చెప్పుకునే ఈయనను నీలి మీడియా తమ సొంత మీడియా ఛానల్‌లో డిబేట్ కోసం కూర్చోబెట్టింది. వైఎస్ అనే ఇంటి పేరును ఇవ్వడానికి సైతం ఈ జగన్ సొంత మీడియా అంగీకరించడం లేదు. ఆమె పేరును మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని చెబుతోంది. మరి ఈ విషయం తాను జైలులో ఉండి షర్మిల చేత పాదయాత్ర చేయించినప్పుడు చెప్పలేదే? అప్పుడు అవసరానికి తగ్గట్టు అలా వాడేశారా? ఇప్పుడొక కొత్త విషయం కూడా బయట పెట్టారు. నిజానికి జగన్ జైలులో ఉన్నప్పుడు తన తరుఫున పాదయాత్ర వైఎస్ భారతిరెడ్డి చేయాల్సి ఉందట. కానీ మనసు నిండా విషయం నింపుకున్న షర్మిల తానే చేస్తానంటూ పరుగులు తీశారట. ఈ విషయాన్ని సదరు కొండా రాఘవరెడ్డి చెబుతున్నారు. మరి అప్పట్లో ఈ విషయం చెప్పలేదే? పైగా సక్సెస్ వస్తే ఎంజాయ్ చేశారుగా?
షర్మిల లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారట..
తన చెల్లి షర్మిల, బావ అనిల్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డారట. అందుకు జగన్ అంగీకరించకపోవడంతోనే ఆమె ఇలా అన్నకు వ్యతిరేకంగా తయారైందట. ఇన్ని తెలిసిన రాఘవరెడ్డి.. నిన్న మొన్నటి వరకూ ఆమెకు అండగా ఎలా నిలబడ్డారో మాత్రం చెప్పలేదు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుతో షర్మిల లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారట. అందుకే జగన్‌కు వ్యతిరేకంగా పని చేయడానికి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారట. ఇలా చేసే బదులు ఆమె ఏకంగా టీడీపీలోనే చేరి ఉండేవారు కదా? పైగా షర్మిలకు టీడీపీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ అందుతోందట. ఒక్కసారి తనకు వ్యతిరేకంగా మాట్లాడేసరికి సొంత చెల్లి అని కూడా చూడకుండా సొంత మీడియాను అడ్డు పెట్టుకుని ఇలాంటి దిగజారుడు మాటలు అనిపించడం జగన్‌కే చెల్లు.