ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 151 మందితో చేస్తున్నది ధర్మ యుద్ధమా? అధర్మ యుద్ధమా? ఆయనే తేల్చుకోవాలి. అయినా 151 మంది ఎక్కడున్నారు లెండి.. ఆయన చేస్తున్న ధర్మమనే అధర్మ యుద్ధం నచ్చక చాలా మంది జంప్ అయిపోయారుగా.. ఇంకా అవుతూనే ఉన్నారు. చివరకు కౌరవ సోదరులు మాదిరిగా 100 మంది మిగులుతారేమో. ఇక ఇప్పుడు సోదరుడిపై వైఎస్ షర్మిల ధర్మ యుద్ధం ప్రకటించేశారు. ఆడవారు యుద్ధ రంగంలోకి ప్రత్యర్థిగా దిగితే ఎదుర్కోవడం అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. అంతేకాదు.. కథనరంగంలో ఆమె కాలుదువ్వడం ప్రారంభించారు కూడా. జగన్ మాత్రం ప్రతిపక్షాలు తన కుటుంబాన్ని విడదీశాయంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.
ఏ రకంగా అయినా తిప్పగల దిట్ట..
మొన్నటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు తన కుటుంబాన్ని చీల్చారని జగన్ ఆరోపించారు.. ఇప్పుడేమో కాంగ్రెస్ చీల్చుతోందన్నారు. రోజుకొక మాట మారుస్తున్నారు. షర్మిల మాత్రం రివర్స్‌లో తన అన్నే తమ కుటుంబాన్ని చీల్చారని.. దానికి తన తల్లి విజయమ్మ, తన కుటుంబం, ఆ దేవుడే సాక్ష్యమని చెబుతున్నారు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. సీఎం జగన్‌ను షర్మిల ఎదుర్కోగలరా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మాటలైతే తూటాల మాదిరిగా బాగానే వదులుతున్నారు కానీ జగన్ వచ్చేసి మాటను ఏ రకంగా అయినా తిప్పగల దిట్ట. ఎన్నికలు వస్తున్నాయంటే వాటిని ఎదుర్కోవడానికి ఏం చేయడానికైనా జగన్ సిద్ధమవుతారు. అలాగే కదా.. కోడికత్తి డ్రామా.. వివేకా హత్య కేసును విపక్షాలపైకి నెట్టడం వంటివి చేశారు.
ఆ స్థాయిలో విమర్శలైతే చేయలేరు..
మరి అంతటి క్రిమినల్ బ్రెయిన్ ఉన్న జగన్‌ను షర్మిల ఢీకొట్టగలరా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే షర్మిల బ్లడ్‌లోనూ రాజకీయముంది కదా. ఇప్పటికే జగన్ కోసం తన కుటుంబాన్ని, పిల్లలను వదిలిపెట్టి రోడ్ల మీదకు వచ్చి ప్రచారం చేశానని, తీరా అధికారం రాగానే జగన్ ప్రవర్తన మారిపోయిందంటూ తన ఆవేదన షర్మిల వ్యక్తం చేశారు. చంద్రబాబో లేదంటే పవన్ కల్యాణో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పెద్దగా ప్రభావం ఉండదు కానీ షర్మిల చేస్తే చాలా ప్రభావమే ఉంటుంది. తనసలు ఇంటి నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందనేది ఆమె చెప్పకనే చెబుతున్నారు. కానీ రివర్స్‌లో జగన్ ఆ స్థాయిలో విమర్శలైతే చేయలేరు. మొత్తానికి జగన్ కుటుంబంలో బయటకు రాకుండా నిక్షిప్తమైన రహస్యాలు ఇంకెన్ని బయటకు వస్తాయోనని ఆందోళన చెందడం తప్ప చేసేదేమీ లేదు.