పొత్తు ధర్మాన్ని పాటించకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. పొత్తు ప్రకటన, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం ప్రకటన వంటి అంశాలపై కూడా పవన్ స్పందించారు. అభ్యర్థుల ప్రకటన పొత్తు ధర్మం కాదని వ్యాఖ్యానించారు. అందుకే తాను కూడా రెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటిస్తున్నానంటూ రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్టే తనకు కూడా ఒత్తిడి ఉంటుందన్నారు. ఇక స్థానాల గురించి పవన్ మాట్లాడుతూ.. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని ఎవరూ చెప్పాల్సిన పని లేదని పవన్ అన్నారు. 50 తీసుకోండి.. 60 తీసుకోండి.. అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని... తనకేమీ తెలియదన్నట్టుగా చాలా మంది చాలా చాలా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
సొంత చెల్లిని వదలని వ్యక్తి మనల్ని వదులుతాడా?
ఇవేమీ తెలియకుండా తాను రాజకీయాలలోకి వచ్చాను అనుకుంటున్నారా? అని పవన్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఒంటరి పోరుకు ఎందకు వెళ్లడం లేదన్న విషయంలో తనకు క్లారిటీ ఉందన్నారు. 2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆ ఎన్నికల్లో 18 లక్షల ఓట్లు సంపాదించామన్నారు. మనం సింగిల్‌గా వెళ్తే సీట్లు సాధిస్తాం కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని పవన్ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ అనే వ్యక్తి టీడీపీతో పాటు జనసేనను కూడా వదలడం లేదన్నారు. సొంత చెల్లిని వదలని వ్యక్తి మనల్ని వదులుతాడా? జగన్‌కు ఊరంతా శత్రువులేనని పవన్ అన్నారు. వైసీపీ నేతలకు కష్టం వస్తే తన దగ్గరకు రావాలని పవన్ పేర్కొన్నారు.
అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి..
ఇక టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ స్పందించారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు.. కానీ చేశారన్నారు. అలా చేయడం పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసిందని.. అందుకు తమ పార్టీ నేతలకు తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉంటున్నానని పవన్ పేర్కొన్నారు. చంద్రబాబు సీనియర్ నేతగా.. ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయన్నారు. అలాగే అనుకోకుండా కూడా కొన్ని జరుగుతుంటాయని.. వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరుతున్నానన్నారు. పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం 2024లో మళ్ళీ అధికారంలోకి రాకూడదని పవన్ పేర్కొన్నారు.