వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పగ్గాలు అప్పగించడమనే ఆ పార్టీ అధిష్టానం చేసిన అద్భుతమైన ఆలోచన. నిజానికి రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీ వెంటిలేటర్‌పైకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు షర్మిల దానికి ఎంతో కొంత ఊపిరిగా మారారని చెప్పవచ్చు. షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతున్నారనగానే చాలా మంది నేతల్లో సంతోషం పెల్లుబికింది. వైఎస్సార్ అభిమానులు కొందరు వైసీపీలో ఉండలేక.. టీడీపీ, జనసేనల్లో చేరలేక ఇబ్బంది పడుతున్న వారికి షర్మిల ఓ వరంలా కనిపించారు. ఈ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి షర్మిలతో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు.
యాక్టివ్ అవుతున్న కాంగ్రెస్ నేతలు..
ఇక షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తనకు పార్టీ ఇచ్చిన బాధ్యతను.. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడేందుకు శతవిధాలుగా యత్నిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు యత్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ వైపు చూస్తున్న ఇతర పార్టీలలోని నేతలకు నమ్మకం కలిగించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా యాక్టివ్ అవుతున్నారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్దమవుతోంది.ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే కొందరు నేతలు ఓకే అని కాంగ్రెస్‌లోకి జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నా కూడా కొందరిలో మాత్రం డౌటానుమానాలు లేకపోలేదు.
ఇప్పటికైనా జనం ఓటేస్తారా?
తెలంగాణలో సొంత పార్టీ నేతలకు హ్యాండిచ్చిన షర్మిల ఇక్కడ ఇవ్వరని గ్యారెంటీ ఏంటని పలువురు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన కాంగ్రెస్‌కు ఇప్పటికైనా జనం ఓటేస్తారా? అనేది మరో అనుమానం. పైగా షర్మిల.. టీడీపీ, జనసేనలకు సహాయ సహకారాలు అందించేందుకు ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారంటూ వైసీపీ నేతలు బీభత్సంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా రకరకాల అనుమానాలు నేతలను వేధిస్తున్నాయి. మరోవైపేమో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు చేసుకోమంటూ కంగారు పెడుతోంది. ఈ తరుణంలో ఏం చేయాలి? అసలు ఆలోచించుకునే టైం కూడా లేదు. మరి ఈ అనుమానాలన్నింటినీ క్లియర్ చేసుకునేదెప్పుడు? దరఖాస్తు చేసుకునేదెప్పుడు? పెద్ద చిక్కే వచ్చి పడింది. మరోవైపు వైసీపీ, టీడీపీ, జనసేనలు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆలోచించుకుంటూ కూర్చుంటే కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్లుండవని.. ఏదైతే అదైందని ఆంధ్ర రత్నభవన్ వైపు పరిగెడతారేమో..