అంజనీ పుత్రుడా.. వీరాధి వీరుడా..శూరుడా.. ధీరుడా అంటూ ఓ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి హీరోయిన్ పాడుతుంది. ఇది పాటే అయినప్పటికే ఇండస్ట్రీకి మాత్రం మెగాస్టార్ వీరాధి వీరుడే.. శూరుడే.. ధీరుడే అనడంలో సందేహం లేదు. అందుకే ఆయనను పద్మ విభూషణ్ వెదుక్కుంటూ మరీ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఏ విపత్తు వచ్చినా సాయం చేసే చేతుల్లో ఇండస్ట్రీ నుంచి ఆయన చెయ్యే ముందుంటుంది. మిగిలిన వారంతా ఆయన్ను అనుసరిస్తూ ఉంటారు. కరోనా సమయంలో.. లాక్‌డౌన్ పెట్టడంతో ఎంతో మంది ఉపాధి లేక నిరుపేదలు అల్లాడిపోయారు. ఆ తరుణంలో ఇండస్ట్రీలోని వారినే కాకుండా.. సామాన్యులను కూడా చిరు ఆదుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
మరోవైపు ఇప్పటికీ ఎంత మంది యువ స్టార్ హీరోలున్నా కూడా ఆయన్ను దాటుకుని మాత్రం ముందుకు ఎవరూ వెళ్లలేదు. అందుకే ఆయన అభిమాన గణంలో నాటి నుంచి నేటి తరం వరకూ అభిమానులున్నారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టుగా ఆయనకు ఎన్నో అవమానాలు.. అయినా సరే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. ఇండస్ట్రీలో గాఢ్ ఫాదర్ లేకుంటే రాణించడం చాలా కష్టం. రోజులేవైనా సరే.. ఈ విషయంలో ఇండస్ట్రీలో ఎలాంటి మార్పూ లేదు. కానీ చిరు ఎలాంటి గాఢ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో ఎదిగారు. ఇండస్ట్రీకి మెగా కాంపౌండ్ వేశారు. ఎంతో మందికి ఆదర్శప్రాయమయ్యారు. తన తనయుడు రామ్ చరణ్ సైతం చెట్టు పేరు చెప్పుకుని పళ్లమ్ముకునేలా కాకుండా స్వయంకృషితో ఎదిగేలా ప్రోత్సహించారు. అందుకే ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు.
మెగా అనేది ఇండస్ట్రీలోనే ఒక బ్రాండ్. ఇండస్ట్రీకి వచ్చేవారికి ఇన్‌స్పిరేషన్. ఎన్నో అవమానాలు, బాధలు , బాధ్యతలు , కుట్రలు - వీటన్నింటినీ అధిగమించి క్రమశిక్షణతో మెగాస్టార్ వేసిన దారి ఇండస్ట్రీకే ఆదర్శంగా నిలిచింది. ‘‘కళారంగంలో పోటీ లేని మేటి.. సేవా రంగంలో తనకు తానే సాటి . నిరంతర సాధకుడు.. నిశ్శబ్ద సేవకుడు.. స్వభావంలో సాత్వికుడు.. సద్గుణాల తాత్వికుడు.. మా పద్మ విభూషణుడు డాక్టర్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అభిమానుల ఆరాధ్య దైవానికిది.. సలక్షణ అలంకారం..! అంజనీ పుత్రుని అత్యున్నత వ్యక్తిత్వానికిది సముచిత ఆభరణం !!’’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.