‘వై నాట్ 175’ అంటూ నిన్న మొన్నటి వరకూ ఊదరగొట్టిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా పూర్తి నిరాశతో మాట్లాడారు. ఎన్నడూ లేనిది.. తనకెలాంటి విచారమూ లేదని ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతానంటూ వ్యాఖ్యానించారు. అసలు జగనేనా? మాట్లాడింది అనిపిస్తోంది కదా. తెలంగాణలో కూడా ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సొంత సర్వేలు చేయించుకుని జనం మైండ్ సెట్‌ని మార్చాలని అధికారంలో ఉన్నవారు ప్రయత్నించడం సహజమే. జగన్ ఇప్పటి వరకూ అలాంటి పనులే చేశారు. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేల ద్వారా చెప్పించారు. మరి అంత చేసిన జగన్‌కు ఇంత నిరాశేంటి?
వాస్తవం కంటే నమ్మకం గొప్పది..
ఇంత చేసి అంత ప్రచారం చేయించుకోవడం జగన్‌కు అలవాటే. పైగా ప్రచారం కోసమే కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అలా తాజాగా రూ.4 కోట్ల ఖర్చుతో తిరుపతిలో ‘ఎడ్యుకేషన్ సమ్మిట్’ పేరిట రెండు రోజుల చర్చా వేదిక ఏర్పాటు చేశారు. సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేరు చూస్తే ఎడ్యుకేషన్ సమ్మిట్ కాబట్టి విద్యారంగానికే పరిమితమనుకునేరు.. కేవలం ప్రచార రంగానికి పరిమితం. ఈ కార్యక్రమంలో రాజ్‌దీప్ సర్దేశాయ్.. మీరు మళ్లీ అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించగా.. వాస్తవం కంటే నమ్మకం గొప్పదంటూ గొప్పగా చెప్పేశారు. ఈ క్రమంలోనే తాను 56 నెలలుగా అధికారంలో ఉన్నానని.. తాను బెటర్‌గానే పని చేశానని భావిస్తున్నానన్నారు.
రాష్ట్రాన్ని.. మా కుటుంబాన్ని విడగొట్టారు..
తనకు ఎలాంటి విచారమూ లేదని.. ఎప్పుడైనా సంతోషంగా దిగిపోతానన్నారు. తొలిసారిగా జగన్ నోటి వెంట ఓటమి పాట వినిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అంటే సర్వేలు చెప్పిందొకటి.. ఆయన బయటకు చెప్పించిందొకటా? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వై నాట్ 175 అంటూ ఊదరగొట్టారు కదా.. ఈ ఓటమి మాటేంటని జనం చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. నీచ రాజకీయాుల చేయడం ఆ పార్టీకి అలవాటని.. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని.. తమ కుటుంబాన్ని కూడా విభజించారన్నారు. తాను కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చినప్పుడు... తమ చిన్నాన్నకు మంత్రి పదవి ఇచ్చి, తమపై పోటీకి నిలబెట్టారన్నారు. ఇప్పుడు ఆ పార్టీ చీఫ్‌గా తన చెల్లిని నిలబెట్టారని.. వారికి దేవుడే బుద్ధి చెబుతాడంటూ శాపనార్ధాలు పెట్టారు.