తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చేర్పులకు సమయం ఆసన్నమైందా? లోక్‌సభ ఎన్నికల లోపు బీఆర్ఎస్ టు కాంగ్రెస్ వలసలు పెరుగుతాయా? కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరదీసిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో కలకలం మొదలైంది. ఏదో జరుగుతోందన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆ నలుగురూ కాంగ్రెస్ తీర్ఘం పుచ్చుకోబోతున్నారన్న ప్రచారమూ ప్రారంభమైంది.
రాజకీయ ప్రాధాన్యత లేదు..
దావోస్ పర్యటన ముగించుకుని ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లి కలిశారు. అలా కలిసిన వారిలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. అయితే తామంతా రేవంత్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని, తమ నియోజకవర్గ సమస్యలపైనే ముఖ్యమంత్రితో చర్చించామని, ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. నిజానికి సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ చాలా కాలం పని చేసి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏమీ లేదని చెబుతున్నా కూడా ఏదో జరుగుతోందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
పొన్నం ప్రభాకర్ మంతనాలు..
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసిందన్న ప్రచారమైతే జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల లోపు ఎంతో కొంతమందిని తమ పార్టీలోకి లాగేయాలని చూస్తోందని సమాచారం. ఈ క్రమంలోనే బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలువురితో మంతనాలు సాగిస్తున్నారు. తొలుత ఆయన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌ను కూడా కలిశారు. ఆ తరువాత రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను సైతం కలిశారు. ప్రకాశ్ గౌడ్ నివాసానికి వెళ్లి మరీ ఆయనతో చర్చలు అయితే జరిపారు. వీరిద్దరినీ కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ కాంగ్రెస్‌తో చేరుతారన్న ప్రచారమూ ప్రారంభమైంది. అనంతరం నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడంతో ఏదో జరుగుతోంది శీనా? అని జనంలో చర్చ మొదలైంది.