టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపిస్తూ.. ఆయనను ప్యాకేజీ స్టార్ అంటూ నిత్యం వైసీపీ నేతలు అవమానిస్తూ వస్తున్నారు. మరి దీనికేమైనా సాక్ష్యాలు ఉన్నాయా? అంటే అదీ లేదు. అన్నీ అర్థం లేని ఆరోపణలే. ఇక మంత్రి రోజా అయితే పవన్‌ను ప్యాకేజీ స్టార్ కొన్ని వందల సార్లు అని ఉంటుంది. ఆమె నోటికి అడ్డూ అదుపు ఉండదు. ఎక్కడుంటే ఆ పాట పాడుతుంది కాబట్టి వదిలేద్దామా? అంటే ఆమె మాటలు వదిలేసేలా ఉండవుగా. అయితే రోజా గురించి ఆమె నియోజకవర్గమైన నగరిలో చాలా దారుణమైన పేరుంది.
తరాలు తిన్నా తరగనంత కూడేశారట...
నిజానికి సీఎం జగన్ ఆమెకు నగరి టికెట్ ఇచ్చినా కూడా గెలిచేది కష్టమే. సొంత పార్టీ నేతలే రోజాకు అధిష్టానం టికెట్ ఇస్తే ఆమెను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారట. పార్టీ కేడర్‌ను కానీ.. నియోజకవర్గ నేతలను కానీ పట్టించుకున్న పాపాన పోలేదట రోజా. తన కోసం తప్ప ఆమె జనం కోసం చేసింది శూన్యమట. తన ఇంటిని మాత్రం రోజా బాగా చక్కబెట్టుకున్నారట. తరాలు తిన్నా తరగనంత కూడేశారట. ఇవన్నీ ప్రస్తుతం రోజాకు మైనస్. ఇక ఆమె సోదరుడు కుమారస్వామి రెడ్డి సొంత పార్టీ కౌన్సిలర్ వద్దే లక్షల్లో ముడుపులు తీసుున్నారట. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ కుమారస్వామి తమ వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసారంటూ వైసీపీ పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మీడియా ముందుకు వచ్చారు.
70 లక్షలు డిమాండ్ చేసిన కుమారస్వామి..
పుత్తూరు చైర్మన్ పదవి రిజర్వేషన్ కేటగిరిలో ఉందట. దాని కోసం రోజా సోదరుడు దళిత మహిళగా ఉన్న తన నుంచి రూ.70 లక్షలు డిమాండ్ చేశారని వెల్లడించింది. అయితే తాను కుమారస్వామికి విడతల వారీగా రూ.40 లక్షలు ఇచ్చానని చెప్పుకొచ్చింది. తనకు చైర్మన్ పదవి ఇవ్వకపోగా.. ఇచ్చిన డబ్బును సైతం తిరిగి ఇవ్వలేదని వెల్లడించింది. ఇదంతా రోజాకు తెలిసే జరిగిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయాన్ని రోజా దృష్టికి సైతం భువనేశ్వరి తీసుకెళ్లారట. కానీ ఆమె కూడా పట్టించుకోలేదట. ఇక చేసేదేమీ లేక భువనేశ్వరి మీడియా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకూ గురువింద మాదిరిగా పవన్‌పై విమర్శలు గుప్పించిన రోజాను జనసేన నేతలు సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు.