బర్త్ డేకి విష్ చేయడంలో ఇంత నీచత్వమా?
రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు.. ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా మాత్రం అంతా ఒక్కటే. మొన్నటికి మొన్న మాజీ సీఎం కాలు జారి పడిపోయి హాస్పిటల్ పాలైతే.. రాజకీయంగా బద్ద శత్రువులైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లి పరామర్శించి వచ్చారు. చాలా హూందాగా ప్రవర్తించారు. ఇక పుట్టినరోజులు వచ్చినా కూడా తన, పర అన్న భేదభావం లేకుండా విషెస్ చెబుతుంటారు. కానీ వైసీపీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రతి దానికి పాలిటిక్స్‌ను ముడిపెట్టి చాలా చీప్‌గా వ్యవహరిస్తోంది. దీనికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి వైసీపీ సోషల్ మీడియా బర్త్ డే చెప్పిన విధానమే నిదర్శనం. పుట్టినరోజుకి విషెస్ చెప్పే విషయంలోనైనా హూందాగా వ్యవహరిస్తుందంటే మరింత దిగజారి ప్రవర్తించింది.
విలువలు విశ్వసనీయత కొలమానంగా ప్రసంగాలు..
నిన్న నారా లోకేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ సోషల్ మీడియా సైతం శుభాకాంక్షలు చెప్పింది. ఈ శుభాకాంక్షలు చెప్పడంలో కూడా తన నీచత్వాన్ని బయటపెట్టింది. వైసీపీ రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా ఏ స్థాయికి దిగజారిపోయిందో అనేది మరోసారి తెలుగు ప్రజలకు తెలియచేసింది. విలువలకు తిలోదకాలు వదిలేసింది. హ్యాపీ బర్త్ డే పప్పు లోకేష్ అని పోస్ట్ పెట్టి.. పాలడబ్బా, బిస్కెట్స్, హార్లిక్స్ ఫోటోలను షేర్ చేసింది. ఇక పొద్దున లేస్తే వైసీపీ అధినేత జగన్ చేసే ప్రసంగాలేమో.. విలువలు విశ్వసనీయత చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ ఆయన సోషల్ మీడియా చేసే పనులేమో ఇంత నీచంగా ఉంటాయి.
ఎవరిని రెచ్చగొట్టాలని..?
జగన్ బర్త్ డే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి వారంతా చాలా నీట్‌గా శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే చెప్పాలి కూడా. లేదంటే ఊరుకోవాలి. అప్పుడే మనకు మర్యాద. జగన్ సోషల్ మీడియా పోస్టు ఆయనకు తెలియదని చెప్పినా ఎవరూ నమ్మరు. ఎన్నికల ముందు ఇలాంటి పనులు చేసి వైసీపీని పాతాళానికి తీసుకెళ్లే బాధ్యతను ఆ పార్టీ సోషల్ మీడియా భుజాన వేసుకున్నట్టుంది. ఎవరిని రెచ్చగొట్టాలని ఇలాంటి పోస్టులు పెడుతున్నారో వారికే తెలియాలి. ఈ పోస్టుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారం ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం గుర్తెరిగి ప్రవర్తిస్తే బాగుంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.