విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం కంటే ఆయన అనుచరులు ఆయనతో వెళ్లని విషయమే హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పటి నుంచో కేశినేని నాని టీడీపీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో నాని రాజీనామా విషయం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కానీ ఆయన అనుచరులు ఆయనతో వెళ్లకపోవడం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అసలు కేశినేని నానిని అనుచరులే వద్దనుకున్నారా? లేదంటే కేశినేని నానియే కావాలని అనుచరులను టీడీపీలోనే కోవర్టులుగా వదిలేసి వెళ్లారా? అనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీని దెబ్బ కొట్టాలనే వ్యూహంతో ఇలా చేశారా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు ఛాన్స్ తీసుకోదలుచుకోలేదట..
రాజకీయాల్లో ఎవరు ఎటు నుంచి వచ్చి దెబ్బేస్తారో చెప్పలేం. ఏమరుపాటుగా ఉంటే దెబ్బ పడుతుంది. దీనిలో భాగంగానే పార్టీని కీలక సమయంలో నాని అనుచరులు దెబ్బతీస్తారోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోవర్టులెవరో తెలుసుకునే బాధ్యతలను బుద్దా వెంకన్న, కేశినేని చిన్నికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. గతంలో అంటే విజయవాడ పశ్చిమ సమన్వయకర్తగా కేశినేని నాని ఉన్న సమయంలో పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ కమిటీలను నియమించారు. వాటిని పర్యవేక్షించేందుకు నాలుగైదు డివిజన్లకొక క్లస్టర్ ఇన్‌చార్జిని నియమించారు. ఇక ఈ ఇన్‌చార్జులను పార్టీకి సంబంధం లేని వారిని ఏరి కోరి నాని నియమించారట. దీంతో బుద్ధా వెంకన్న అభ్యంతరం తెలిపారట.
నేతల్లో సమన్వయం కొరవడిందట..
ఆ తరువాత కేవలం డివిజన్ కమిటీలను మాత్రమే నాని నియమించుకున్నారు. వారిలోనూ దాదాపు తన అనుచరులనే నియమించారు. తాజాగా ఈ కమిటీల రద్దుకు టీడీపీ పశ్చిమ సీనియర్ నాయకులు అధిష్టానానికి సిఫార్సు చేశారు. త్వరలోనే ఈ కమిటీలు రద్దు కానున్నాయి. అలాగే టీడీపీ విజయవాడ పశ్చిమలో నేతల్లో సమన్వయం కొరవడిందట. అధిష్ఠానం ఆదేశాల మేరకు బుద్దా వెంకన్న సారథ్యంలో నాయకులందరినీ కలిసి మెలిసి పని చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయట. కేశినేని నాని ఉండగా పార్టీలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఇన్‌చార్జులను పక్కనబెట్టి సొంతవారిని ప్రోత్సహించారట. దీంతో ఆయా నియోజకవర్గ కేడర్‌లో కొంత అయోమయం నెలకొందట. వాటన్నింటినీ సెట్ చేసే పనిలో పార్టీ అధిష్టానం ఉంది.