నిన్న బాలశౌరి.. ఇవాళ లావు.. రేపెవరో..?
వైసీపీకి ఎంపీ అభ్యర్థులు కావలెను.. అర్హతలేంటో కూడా చెప్పడం జరుగుతుందిలెండి.. కంగారొద్దండోయ్..! నిన్న ఎంపీ బాలశౌరి వైసీపీ నుంచి జంప్.. ఇవాళ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. రేపు మరొకరు..! వీరు పోయినా ఎంపీ కేశినేని నాని లాంటి వారు వచ్చారంటారా? పోయేవాళ్లు ఎక్కువ.. వచ్చేవాళ్లు తక్కువైతే లెక్కెలా సెట్ అవుతుంది? అసలు ఇలాంటి వాళ్లు ఇంకెంత మంది నాని వంటి వారు కావాలో ఏమో కూడా చెప్పలేం. ఇవాళ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రకటించేశారు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు తేల్చి చెప్పేశారు కూడా. సో.. దీన్ని బట్టి చూస్తే.. వైసీపీలో వికెట్లు రాలిపోతున్నాయ్.. ప్లీజ్ ప్లీజ్ వైసీపీలోకి రండి.. అభ్యర్థులుగా పోటీ చేయండనే పరిస్థితి ఉందని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట.
జగన్ ప్రతిపాదనను అంగీకరించను..
ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాలు వైసీపీకి తలనొప్పిగా మారాయి. సర్వేల పేరు చెప్పి కొందరిని తొలగించడం.. మరికొందరిని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం వంటివి అభ్యర్థులకు మింగుడు పడటం లేదు. నరసరావుపేట లోక్‌సభ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలనే యోచనతో లావు శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరుకు షిఫ్ట్ చేసింది. కానీ ఆయన ససేమిరా అన్నారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్‌తో శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఆ తరువాత ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన మాటలతో జగన్ కన్విన్స్ అయ్యారని భావించడం లేదన్నారు. అలాగే గుంటూరు నుంచి పోటీ చేయాలనే సీఎం ప్రతిపాదనను తాను అంగీకరించబోనన్నారు.
పార్టీలో ఉండి మాత్రం ప్రయోజనమేముంది?
ఇక వల్లభనేని బాలశౌరీతో పాటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సైతం పార్టీ నుంచి బయటకు వచ్చారు. బాలశౌరి ఇటీవలే జనసేనలో చేరారు. వెనుకబడిన వర్గానికి చెందిన నాయకుడు సంజీవ్ కుమార్ పార్టీని వీడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎంపీ పదవి మాత్రమే ఉందని, తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించే అధికారాలు లేవని అన్నారు. ఇలాంటి తరుణంలో పార్టీలో ఉండి మాత్రం ప్రయోజనమేముంది? ఇక తాజాగా మరో ఎంపీ వైసీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. మొత్తంగా ముగ్గురు ఎంపీలు పార్టీని వీడగా ఒక్కరు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి వైసీపీకి ఎంపీలు కావలెను. అర్హతలేంటంటే.. ఏమీలేదు.. అధిష్టానం ఏం చెబితే దానికి తలూపడమే అంతేగా మరి..!