అయోధ్యలో అత్యద్భుతమైన ఘట్టానికి ఇంకొంత సమయమే ఉంది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందిన అందరూ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా ఈ వేడుకకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయోధ్యకు వెళ్లేముందు.. ఈ ఆహ్వానం ఆ అంజనీ పుత్రుడు.. ఈ అంజనీ పుత్రునికి పంపిన ఆహ్వానంగా మెగాస్టార్ చిరంజీవి ఈ మధురమైన ఘట్టాన్ని అభివర్ణించారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఈ ఆహ్వానంపై ఆయన స్పందించారు.
చర్రితను సృష్ణించేలా.. పునరావృతం చేసేలా.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా అయోధ్యలో జరగబోతున్న రామ్ లల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి అందిన ఆహ్వానాన్ని.. నాకు వచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది. 500 ఏళ్లుగా ఎన్నో తరాలు వేచి చూసిన అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఆ అంజనాదేవి కుమారుడు చిరంజీవి అయిన హనుమంతుడు.. భూమిపై ఉన్న ఈ అంజనాదేవి కుమారుడినైన నాకు ఈ వెలకట్టలేని అద్భుతమైన క్షణాలను బహుమతిగా ఇచ్చాడని భావిస్తున్నాను. ఈ విషయం చెప్పడం నాకు మాటలు సరిపోవు. ఎన్నో జన్మల పుణ్యఫలమిది. ఇంత మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న ప్రధాని నరేంద్రమోడీగారికి, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిగారికి నా శుభాకాంక్షలు. ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతోన్న వారందరికీ ఇవే నా శుభాభినందనలు. రేపటి ఆ బంగారు క్షణాలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. జై శ్రీరామ్.. అని చిరంజీవి తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.