యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అపూరూప ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. బాల రాముడి ప్రాణప్రతిష్టాపన మహోత్సవానికి అయోధ్య నగరం అన్ని రకాలుగా సిద్ధమైంది. ఆహ్వానితులందరూ ఒక్కొక్కరుగా అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో రామ్ లల్లా విగ్రహ సృష్టికర్త అరుణ్ యోగిరాజ్ గురించి, ఆయన చెక్కిన రామ్ లల్లా విగ్రహ విశిష్టతల విషయానికి వస్తే..
రామ్ లల్లా విగ్రహ సృష్టికర్త అరుణ్ యోగిరాజ్ కుటుంబం ఐదు తరాలుగా శిల్పులుగా ఉన్నారు. అరుణ్‌కు కూడా చిన్నప్పటి నుండే శిల్పాల తయారీ అంటే ఆసక్తి ఉండేది. కానీ ఎంబీఏ చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ ఎంతో కాలం పని చేయలేదు. తన ఆసక్తి మొత్తం శిల్పకళ మీదే ఉండటంతో.. తన ఉద్యోగం మానేసి తనకు ఇష్టమైన, తన కుటుంబం వృత్తియైన ఈ శిల్పకళవైపు అడుగులు వేశాడు. అరుణ్ చెక్కిన శిల్పాల్లో ముఖ్యమైనవి కేదార్‌నాధ్‌లోని 12 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం మరియు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న 30 అడుగుల సుభాష్ చంద్ర బోస్ విగ్రహం. ఈ రెండింటికి ఎంతో విశిష్టత ఉన్న విషయం తెలిసిందే.
రామ్ లల్లా విగ్రహం గురించి అరుణ్ చెబుతూ.. ఈ శిల్పానికి శిలను ఎన్నుకోవడం చాలా కష్టమైంది. ఇండియాలోని ఎన్నో ప్రాంతాల నుంచి రాళ్లు తెప్పించాము. ఇండియా నుండే కాకుండా కర్కల ఇంకా నేపాల్ నుంచి కూడా రాళ్లు తెప్పించాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, భారత ప్రభుత్వ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్క రాయిని పరీక్షించారు. కర్నాటకకు చెందిన హెచ్‌డి కోటెకి చెందిన క్రిష్ణ శిలను ఫైనల్‌గా ఎంపిక చేశాం. ఇంతవరకు ఎవ్వరు చూడని, రాముడి బాల్యపు విగ్రహాన్ని తయారు చేయడం అనేది పెద్ద సవాల్. ఎందుకంటే రామ్ లల్లా ఇలా ఉంటాడనే ఆధారం ఎక్కడా లేదు. అందుకే రామ్ లల్లా విగ్రహానికి రిఫరెన్స్‌గా 1200 నమూనాలు చూశాం. రామ్ లల్లా విగ్రహం పాదాల నుంచి శిరస్సు వరకు 51 అంగుళాలు ఉంటుంది. ఈ కొలతలకి కారణం రామనవమి రోజు సూర్య కిరణాలు విగ్రహం శిరస్సు మీద పడాలి. అలాగే 5 ఏళ్ల బాల రాముడిలా కనిపించాలి అనే సూచనలు వచ్చాయి. ఈ శిల్పాన్ని చెక్కడానికి ఎంపికైన వాళ్లం ఒకరికి ఒకరం తెలిసినా.. విగ్రహాలు చెక్కినంత కాలం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. మొత్తం మూడు విగ్రహాలలో ఎంపికైన విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరుగుతుంది. మిగతా వాటిని కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలోనే ప్రతిష్టించుతారని అరుణ్ చెప్పుకొచ్చారు.