టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుతోనే అడుగులు ముందుకు వేస్తున్నాయి. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడంతో ఓట్లు చీలి వైసీపీకి బాగా మేలు జరిగింది. ఈసారి అలాంటి పరిస్థితులు ఉండకూడదనే ఇరు పార్టీలూ పొత్తు పెట్టుకున్నాయి. అయితే ఇరు పార్టీల మధ్య సీట్ల లొల్లి మాత్రం తప్పేలా లేదు. జనసేన అడుగుతున్న సీట్లకు.. టీడీపీ ఇస్తామంటున్న సీట్లకు పొంతన లేదని సమాచారం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో ఉన్న 35 నియోజకవర్గాల్లో జనసేన అడుగుతున్న స్థానాలకు.. టీడీపీ ఇస్తానంటున్న సీట్లు మధ్యన పొంతన లేదని సమాచారం. నిజానికి ఉత్తరాంధ్రలో టీడీపీకి గట్టి పట్టుంది.
పవన్ పట్టుబట్టారా?
గ్రేటర్ విశాఖ పరిధిలో భీమిలి, దక్షిణం, పెందుర్తి లేదా అనకాపల్లి జిల్లాలో యలమంచిలి మాత్రమే ఇస్తామని టీడీపీ చెబుతోంది. అయితే ఉత్తరాంధ్రలో అనేక చోట్ల పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి పార్టీ టికెట్ ఆశిస్తున్నా వారిలో శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల, పాతపట్నం.. అలాగే విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, గజపతినగరానికి చెందిన అభ్యర్థులున్నారు. ఇలా అనేక సీట్లలో జనసేన అభ్యర్థులు టిక్కెట్లను ఆశిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తన వారి కోసం.. పార్టీ కోసం గట్టిగా పట్టు పట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితా వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది.
పొత్తు చెడగొట్టేందుకు వైసీపీ యత్నం..
నిజానికి టీడీపీకి 175 స్థానాల్లోనూ పట్టుంది. జనసేనకు మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే పట్టుంది. అది కూడా ఎంతమేర గెలుస్తుందనేది చెప్పడం కూడా కష్టమే. టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి ఈసారి కాస్త ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందనైతే చెప్పొచ్చు. ఒకవేళ పొత్తు లేకుంటే మాత్రం పదుల సంఖ్యలో గెలుపోటములను తారుమారు చేయగల సత్తా జనసేనకు ఉంది. ఈ క్రమంలోనే జనసేన ఎన్ని సీట్లు కోరుతోంది.. టీడీపీ ఎన్ని ఇస్తామంటోంది ఇప్పటి వరకైతే బయటకు రాలేదు. వీరిద్దరి పొత్తు చెడగొట్టేందుకు వైసీపీ మాత్రం శతవిధాలుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. దీనికోసం రకరకాల ప్రచారం నిర్వహిస్తోంది. కేవలం జనసేనకు టీడీపీ 25 సీట్లే ఇస్తానంటోందని ప్రచారం ప్రారంభించింది. కాబట్టి టీడీపీ, జనసేనలు సీట్లలొల్లికి వీలైనంత త్వరగా చెక్ పెడితే వేరొకరికి అవకాశం ఇవ్వకుండా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.