అయోధ్య రామ మందిర నిర్మాణం బీజేపీ ప్రభుత్వానికి బీభత్సమైన మైలేజ్ తెచ్చి పెడుతోంది. అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం పట్టును సాధించలేకపోతోంది. ఎప్పటి నుంచో దక్షిణ భారతదేశంలో పట్టు కోసం బీజేపీ నానా తంటాలు పడుతోంది. గజినీ మహ్మద్ టైపులో ప్రతీ రాష్ట్రంలోనూ తన దండయాత్రను కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పట్టుకోసం చాలా ప్రయత్నిస్తోంది. అయితే ఏపీతో పోలిస్తే తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి మంచి పట్టే ఉంది కానీ అది అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయిలో మాత్రం లేదనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాలను పట్టించుకున్నదే లేదు..
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకోకపోవడానికి రెండు కారణాలున్నాయి. తెలంగాణలో అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన, తెచ్చిన పార్టీలు రెండూ బలంగా ఉండటం.. అలాగే ఏనాడూ కేంద్రం తెలుగు రాష్ట్రాలను పట్టించుకోకపోవడం. ఇక తెలంగాణలో అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలక నేతలంతా ఓటమి పాలయ్యారు కానీ ఆ పార్టీ ఓట్ల శాతాన్ని మాత్రం పెంచుకుంది. అలాగే సీట్ల సంఖ్యను సైతం క్రమక్రమంగా పెంచుకుంటూ వెళుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను బీజేపీ దక్కించుకుంది. మరి అయోధ్య ఎఫెక్ట్ ఈసారి ఎంతో కొంత ఉండకమానదు. ఈ తరుణంలో ఎన్ని ఎంపీ సీట్లను గెలుచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
నాటి నుంచి ఏపీకి అన్యాయమే..
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను ఇప్పటికే బీజేపీ సిద్ధం చేస్తోంది. అగ్ర నేతలంతా తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఏపీలో అయితే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప బీజేపీ ప్రయత్నాలేవీ ఫలించవనడంలో సందేహం లేదు. అయోధ్య రామ మందిర నిర్మాణం కాదు కదా.. బీజేపీ ఏం చేసినా అక్కడి ప్రజలు మాత్రం ఆ పార్టీని అక్కున చేర్చుకోరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి ఏపీకి కేంద్రం అన్యాయమే చేస్తూ వస్తోంది. రాజధాని నిర్మాణానికి ఏదో చేస్తారనుకుంటే మోదీ పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ప్రత్యేక హోదా ఊసే లేదు. పైగా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం వంటి అంశాలు ఏపీ ప్రజల్లో బీజేపీపై ఆగ్రహానికి కారణమయ్యాయి.