సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ని సినిమాలు చేస్తున్నా.. వారి ఆశలన్నీ దర్శకధీరుడు రాజమౌళితో చేయబోతున్న SSMB29పైనే ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కానీ, అతిశయోక్తి చెందాల్సిన అవసరం కానీ లేనే లేదు. ఎందుకంటే, హీరోలకు రాజమౌళి ఇస్తున్న గుర్తింపు అలా ఉంది. ప్రభాస్, రామ్ చరణ్, తారక్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్స్‌గా చలామణీ అవుతున్నారంటే.. అదంతా రాజమౌళి మహత్యమే అని ఎవరిని కదిలించినా చెబుతారు. ఈ లిస్ట్‌లో మహేష్ పేరును ఎప్పుడెప్పుడు చూస్తామా అని వేయి కళ్లతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూసే వారందరికీ గుడ్ న్యూస్ వచ్చేసింది.
ఈ చిత్రానికి కథని సమకూరుస్తున్న రాజమౌళి తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. SSMB29 స్క్రిఫ్ట్ వర్క్ పూర్తయినట్లుగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతే, SSMB29 ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే, తాజాగా మహేష్ బాబు కూడా ఒంటరిగా (ఎప్పుడూ ఫ్యామిలీతో కలిసే వెళ్తాడు) జర్మనీకి వెళ్లినట్లుగా కొన్ని ఫొటోలు, వార్తలు బయటికి వచ్చాయి. 3 రోజుల పాటు జరిగే ఈ టూర్.. SSMB29 టెక్నికల్ విషయాలకు సంబంధించినదిగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినబడుతున్నాయి.
అటు మహేష్ బాబు టూర్, ఇటు విజయేంద్ర ప్రసాద్ మాటలు.. విన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ యమా ఖుషి అవుతున్నారు. అతి త్వరలోనే చరిత్రని తిరగరాసే సినిమాకు నాంది పలకబోతున్నారనేలా.. ఈ SSMB29 ప్రాజెక్ట్‌పై వారు మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి కూడా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి.. లొకేషన్స్ లాక్ చేసి.. ఇక యుద్ధం మొదలెట్టడమే తరువాయి అనేలా ప్రిపేర్ అవుతున్నాడనేలా టాక్ వినబడుతోంది. మొత్తంగా అయితే.. హిస్టరీని తిరగరాసే సినిమాకి త్వరలోనే శ్రీకారం పడనుందనేది.. ఈ అప్‌డేట్స్ చూస్తుంటే అర్థమవుతోంది.