నయనతార నటించిన 75వ చిత్రం అన్నపూరణి ఇటీవల ఓటీటీలో విడుదలైన తర్వాత వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని.. మరీ ముఖ్యంగా హిందువుల, ముస్లింల పెళ్లిని ప్రోత్సహించేలా ఉందంటూ కొందరు హిందూమత వాదులు హెచ్చరికలకు దిగారు. వెంటనే ఈ సినిమాని ఓటీటీ నుండి తీసేయకపోతే.. తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడంతో.. ఈ సినిమాని స్ట్రీమింగ్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ వెంటనే.. ఓటీటీలో ప్లే కాకుండా నిలిపివేసింది. అయితే ఇంత జరుగుతున్నా.. ఇప్పటి వరకు నయనతార స్పందించలేదు. ఓటీటీలో ఎప్పుడైతే ఈ సినిమాని తొలగించారో.. నయనతార క్షమాపణలు చెబుతూ.. ఓ భారీ లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో..
జై శ్రీరామ్.. ఈ ప్రకటనని బరువెక్కిన హృదయంతో చేస్తున్నా. ప్రజలలో స్ఫూర్తి నింపడానికి మాత్రమే అన్నపూరణి సినిమాను తీశాం. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడమే మా ఈ సినిమా ఉద్దేశం. అంతే కానీ, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని మాత్రం చేయలేదు. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాను, అలాగే థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడిన సినిమాను ఓటీటీ నుండి తొలగిస్తారని అనుకోలేదు. అయినా, మాకు తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచాం. అలా గాయమైన ప్రతి ఒక్కరినీ క్షమించమని అడుగుతున్నాను. నా ఈ 20 సంవత్సరాల జర్నీని ఒక్కసారి గమనిస్తే.. అంతా పాజిటివిటీని వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం.. అని నయనతార చెప్పుకొచ్చింది.
ఈ ప్రకటనతో సమస్య సాల్వ్ అయిందనే అనుకోవచ్చు. కాంట్రవర్సీకు చెక్ పడిందనే భావించవచ్చు. కాగా.. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ అన్నపూరణి సినిమాలో రాజా రాణి ఫేమ్ జై, అందులో నయనతారకు నాన్నకు నటించిన సత్యరాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. నీలేశ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.