లోక్‌సభ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. బీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ అయితే పెట్టారు. బీఆర్ఎస్‌కు ప్రస్తుతం అనుకూల వాతావరణం లేదన్నది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ దారుణంగా దెబ్బతిన్నది. ఆ పరిస్థితుల నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకున్న దాఖలాలు అయితే లేవు. నానాటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో స్ట్రాంగ్ అవుతూనే ఉంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బతింటే పార్టీకి మరింత దారుణ పరిస్థితులు ఎదురవుతాయని బీఆర్ఎస్ భావిస్తోంది.
కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తాయా?
ప్రస్తుతం కేటీఆర్, హరీష్‌రావులు రంగంలోకి దిగారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలపై కొందరు బీఆర్ఎస్ నేతలు మాత్రం అనాసక్తి ఉన్నారని సమాచారం. ఈ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తాయని వారు నమ్మడమే దీనికి కారణమని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పెద్దగా సమయం కావడం లేదు. కేవలం రెండు నెలలే అవుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీపై వచ్చిన వ్యతిరేకత కూడా ఏమీ లేదు. పైగా ఉచిత బస్సు ప్రయాణం సత్ఫలితాలను ఇస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి ఫేవర్‌గా మారింది. ఇంకా కొన్ని పథకాలు, హామీలు అమలు కావాల్సి ఉంది.
బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఆందోళన..
అయినా సరే.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్న నమ్మకంతో జనం ఉన్నారు. ఎలా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత అన్నదే లేదు. పైగా సింగరేణి ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ చావు దెబ్బ తిన్నది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఫలితాలు ఎలా వస్తాయోనని బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లోక్‌సభ బరిలోకి దిగి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వాటికి ఫలితం దక్కకుంటే ఎలా అని భయపడుతున్నారట. అందునా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కేవలం తొమ్మిది సీట్లకు పరిమితమైంది. ఇక ఇప్పుడైతే విజయమనేది మరింత కష్టమని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారట. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లింది కూడా లేదు. అలాంటప్పుడు ఈసారి ఎన్నికల్లో విజయం చాలా కష్టమని భావిస్తున్నారట.