యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జా హీరోగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా హనుమాన్. విడుదలైన మొదటి ఆట నుండే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, సినీ, రాజకీయ ప్రముఖులందరూ చిత్రయూనిట్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి స్టార్ హీరోయిన్ సమంత కూడా చేరారు. హనుమాన్ సినిమాని చూసిన సమంత సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
హీరో తేజ సజ్జా ఆల్రెడీ సమంతతో ఓ బేబీ అనే సినిమాలో చేశాడు. ఆ అభిమానం కూడా తను చాటుకుంది. సమంత ఈ సినిమా గురించి ఏమని రియాక్ట్ అయిందంటే.. మనల్ని బాల్యంలోకి తీసుకెళ్లి, చిన్నపిల్లల్ని చేసే సినిమాలు చాలా గొప్పవి. హనుమాన్ సినిమాలో ప్రతీ అంశం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. విజువల్స్, కామెడీ, సంగీతం.. ఇలా ప్రతీది అత్యద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం వెండితెరపై హనుమంతుడు చేసిన మ్యాజిక్‌తో అందరినీ కట్టిపడేస్తుంది. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు ఇచ్చిన ప్రశాంత్ వర్మకు థ్యాంక్స్. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నాను. తేజ తన నటనతో ఆశ్చర్యపరిస్తే.. అమాయకుడైన హనుమంత పాత్ర ఈ సినిమాకు ప్రధాన బలం. గ్రాఫిక్స్ ఈ సినిమాకు మరింత శోభను చేకూర్చాయి.. అని సమంత హనుమాన్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది.
సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో వైపు చిత్రయూనిట్ కూడా సమంతకు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటోంది. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.