మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమాతో తన సినిమా ఊరు పేరు భైరవకోన క్లాష్ ఉంటుందని అన్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. సంక్రాంతి బరిలో దిగాల్సిన రవితేజ ఈగల్ సినిమాని చివరి నిమిషంలో ఇండస్ట్రీ పెద్దలు వాయిదా వేయించిన విషయం తెలిసిందే. పరిస్థితిని అర్థం చేసుకుని పోస్ట్‌పోన్‌కి ఒప్పుకున్న రవితేజకి సోలో రిలీజ్ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ, మళ్లీ ఆ సినిమాకు భారీ పోటీ తప్పేలా లేదు. ఫిబ్రవరి 9న ఈగల్‌తో పాటు విడుదలకు ఇంకో రెండు మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. విడుదల తేదీలు కూడా ప్రకటించి.. మాస్ రాజాకు పోటీ అనేలా బరిలోకి దిగుతున్నాయి.
అందులో ఒకటి సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన కాగా, రెండోది సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్. ఈ రెండు సినిమాలు రవితేజకి పోటీగా ఫిబ్రవరి 9న బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈగల్‌తో క్లాష్ గురించి సందీప్ కిషన్‌ని మీడియా అడిగింది. అందుకు సందీప్ మాట్లాడుతూ..
మా సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నాం. కానీ, సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉండటంతో.. ఇది సరైన సమయం కాదని ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాం. సిద్ధు టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9న రిలీజ్ అని ప్రకటించారు. వాళ్లతో మాట్లాడిన తర్వాతే మేము కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము డేట్ మార్చుకునే అవకాశం కూడా లేదు. మార్చాల్సి వస్తే చాలా ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాం. అయినా ఈగల్ రిలీజ్ డేట్ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు. మా నిర్మాతకు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు మంచి పరిచయం ఉంది. ఇష్యూస్ ఏమీ ఉండవనే అనుకుంటున్నా. ఒకవేళ వాళ్లు ఫోన్ చేసి మాట్లాడి ఉంటే మాత్రం వివరణ ఇచ్చేవాళ్లం.. అని వివరంగా చెప్పుకొచ్చాడు.