తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడా నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీతో ఏ విషయంలో అయితే గొడవ జరిగిందో.. అదే విషయంలో తిరిగి కాంగ్రెస్ పార్టీతోనూ ఆమె విభేదిస్తున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల విషయమై ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు స్వీకరించరాదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తున్న కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకూ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం ఎలాంటి నిర్ణయమూ తీసుకోరాదని తమిళిసై నిర్ణయించారు.
తిరస్కరించే హక్కు గవర్నర్‌కు లేదు..
గతంలో ఈ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల విషయంలోనే గవర్నర్, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య గొడవ తలెత్తింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్‌కుమార్, సత్యనారాయణ పేర్లను కేబినెట్ నామినేట్ చేస్తూ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది. ఆ సమయంలో గవర్నర్ వారిద్దరికీ ఆమోదం తెలపలేదు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నామినేట్ చేసిన తమను తిరస్కరించే హక్కు గవర్నర్‌కు లేదంటూ తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సమయంలో తలెత్తిన గొడవ దాదాపు ఎన్నికల వరకూ కొనసాగింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు వినిపించడం జరిగింది.
సైలెంట్ అయిపోతుందా?
ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో నిర్ణయం తీసుకోరాదని గవర్నర్ నిర్ణయించారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఉన్నారు. కానీ తమిళిసై నిర్ణయంతో వీరి పదవికి బ్రేక్ పడిపోయింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా గవర్నర్ గొడవకు దిగబోతున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి తమిళిసై నిర్ణయాన్ని గౌరవించి తెలంగాణ ప్రభుత్వం సైలెంట్ అయిపోతుందా? ఏం జరుగుతుందో వేచి చూడాలి.