‘నేను గెలిచి కూర్చోవడానికి కుర్చీ ఎక్కడుందో వెదుక్కునే లోపే బావామరుదులు నాపై వార్ ప్రకటించారు’ అని ఓ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంతకీ ఆ బావాబావమరుదులు ఎవరో ఇప్పటికే అర్థమైపోయే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది రోజులకే హామీల గురించి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు. ఇక ఇప్పుడు ఆ విమర్శలు మరింత పెంచేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం.. అన్ని విషయాలపై ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా ఖజానా పరిస్థితేంటో చూసుకోవాలి. ఆపై నిధులు తక్కువగా ఉంటే ఆ దిశగా ఆలోచనలు చేయాలి.
అసహనమే అలా మాట్లాడిస్తోందా?
ఏ ప్రభుత్వానికైనా హామీల అమలుకు కనీసం ఆరు నెలలైనా సమయం పడుతుంది. అయినా సరే.. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తూనే ఉంది. ఓ పక్క వచ్చిన నెలలోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. వరుసబెట్టి అన్ని విషయాలపై దృష్టి సారిస్తోంది. ఈలోపే రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్‌రావు యుద్ధం ప్రకటించేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో వచ్చిన అసహనమే వారిని అలా మాట్లాడేలా చేస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిజానికి కొంత ఆలోచన కలిగిన జనాలకు ఎవరికైనా అది నిజమే అని అనిపించక మానదు.
ఆచితూచి వ్యవహరించాలి..
పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్‌కు నష్టం కలిగించేవే. అయితే బీఆర్ఎస్ ఆలోచన మరోలా ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయలేకపోతోందని జనాలను నమ్మించి తద్వారా లాభం పొందాలి. అయితే ఇలాంటి సందర్భంలోనే ఆచితూచి వ్యవహరించాలి. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు పార్టీకి లాభం చేకూరిస్తే ఓకే కానీ మిస్ ఫైర్ అయితే మాత్రం అసలుకే ఎసరొస్తొంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్‌కు లోక్‌సభ ఎన్నికలలో కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే చాలా కష్టం. అసలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని పెంపొందింపచేయాల్సిన తరుణమిది. ఆ దిశగా ఆలోచనలు చేస్తే బాగుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.