సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీకి దిగిన చిన్న సినిమా హనుమాన్ ఇప్పుడు పెద్ద నెంబర్లను నమోదు చేస్తుంది. విడుదలకు ముందు చిన్న సినిమా చిన్న సినిమా అన్నవారే.. హనుమాన్ కలెక్షన్స్ చూసి అవాక్కవుతున్నారు. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ-నిర్మాత నిరంజన్ రెడ్డి లు ఎందుకంతగా పట్టుబట్టి సంక్రాంతికే రిలీజ్ చేసారో.. సినిమా విడుదలయ్యాక టాక్ చూసాక అందరికి అర్ధమైంది. పెద్ద సినిమాలు కూడా సంక్రాంతిని సరిగ్గా వినియోగించుకోలేకపోవడం కూడా హనుమాన్ కి కలిసొచ్చింది.
అయితే ప్రీమియర్స్ నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రోజు రోజుకి ప్రభంజనం సృష్టిస్తూ.. ఆడియన్స్ చేత శెభాష్ అనిపించుకున్న హనుమాన్ కి సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ దక్కలేదు, హనుమాన్ విడుదలకు ముందే పోటీ నుంచి తప్పించడానికి సకలవిధాలుగా ప్రయత్నాలు చేసారు, సినిమా విడులయ్యాక స్క్రీన్స్ దక్కకుండా చేసారు.. ఇప్పుడు హనుమాన్ బావుంది అని సినిమా ప్రముఖులు ఎవ్వరూ ట్వీట్ వెయ్యలేదు అంటూ నెటిజెన్స్ హనుమాన్ విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నారు.
నిన్న కనుమ రోజున నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో హనుమాన్ ని వీక్షించారు. ఇక కన్నడ హీరో శివరాజ్ కుమార్ బెంగుళూరులో హనుమాన్ ని వీక్షించారు. మిగతా వారెవరూ హనుమాన్ గురించి ఎలాంటి ట్వీట్ వేయకపోవడంతో హనుమాన్ కి సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ దక్కలేదు అనే అభిప్రాయాలు మొదలైయ్యాయి. అయితే పండగ సమయం.. సెలబ్రిటీస్ అంతగా సినిమాలు చూసే మూడ్ లో ఉండరు, ఫామిలీస్ తో పండగ జరుపుకుంటారు, అందుకే సినిమా చూసి ఆ సినిమాపై స్పందించలేదు, కానీ ఇకపై హనుమాన్ పై సెలబ్రిటీస్ స్పందన ఉండొచ్చేమో అనుకుంటున్నారు సినీ జనాలు.