హ్యాపీ అయ్యారా అంటూ దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ చూస్తే అందరికి అనిపిస్తుంది. తనపై నెగిటివిటి పోగొట్టుకోవడానికి మారుతి చాలానే కష్టపడ్డాడు అని. ప్రభాస్ అభిమానుల చేతిలో ట్రోల్ అయిన మారుతి ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ తోనే సమాధానం చెబుతా అన్నట్టుగా ఈరోజు పొంగల్ సందర్భంగా ప్రభాస్ తో చేస్తున్న మూవీ రాజా సాబ్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వదిలి ప్రభాస్ ఫాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చి శాంతింప చేశాను అనుకుంటూ హ్యాపీ అయ్యారా అని సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు.
మారుతి తో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అనగానే.. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యుండి, ప్లాప్ దర్శకుడు మారుతితో సినిమా చెయ్యడం ఏమిటి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతూ మారుతిని చెడామడా తిడుతూ ట్రోల్ చేసారు. ఆ దెబ్బకి మారుతి ప్రభాస్ మూవీని సైలెంట్ గా మొదలు పెట్టేసి షూటింగ్ చేసుకుంటున్నాడు తప్ప మధ్యలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఈమధ్యలో ప్రభాస్ వింటేజ్ లుక్ లీకై వైరల్ అయ్యింది. దానితో ఎంతోకొంత నెగిటివిటి తగ్గింది.
సంక్రాంతికి పొంగల్ ఫీస్ట్ అంటూ ప్రభాస్ రాజా సాబ్ లుక్ రివీల్ చేశారు. లుంగీ కట్టి వింటేజ్ లుక్ లో ప్రభాస్ రాజా లుక్ ని అభిమానుల మధ్యన భీమవరంలో రివీల్ చేసారు. అది కాస్త నెట్టింట సంచలనంగా మారింది. దానితో మారుతి ఇప్పుడు హ్యాపీనా అంటూ ప్రభాస్ ఫాన్స్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. మారుతి సోషల్ మీడియా ట్వీట్ చూసిన నెటిజెన్స్ ప్రభాస్ ఫాన్స్ దెబ్బకి మారుతి ఎంత జడిసిపోయాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.