ఏపీ సీఎం జగన్.. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తనకు కానీ.. తన పార్టీకి కానీ.. తన పార్టీ అభ్యర్థులకు కానీ ఎవరైనా ఎదురెళితే నయానో భయానో దారికి తెచ్చుకుంటారు. జగన్ దగ్గర బేరాలుండవ్. ఊ అంటావా? ఉహూ అంటావా? అంతే.. ఊ అంటే ఓకే.. ఉహూ అన్నారో.. పోలీసులు.. కేసులు నానా రచ్చ. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే తల్లిని చూడటానికని యూఎస్ నుంచి ఇండియా వచ్చిన వ్యక్తినే వదల్లేదు. అరే.. తల్లి ఆరోగ్యం బాగోలేదు.. చూడాలని మొత్తుకున్నా.. ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేసిన ఘనత మన ఏపీ సీఎంది. మరి ఆయన చెల్లి తాజాగా మాట్లాడిన మాటలు చూస్తే పూర్తిగా రివర్స్.
రాజకీయాల్లో ఇది సర్వసాధారణం..
ఇవాళ జగన్ సోదరి, కాంగ్రెస్ నాయకురాలు షర్మిల తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఇందులో వింతేమీ లేదు. రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. తమ ఇంట వివాహానికి పార్టీలతో సంబంధం లేకుండా నేతలందరినీ ఆహ్వానిస్తారు. కానీ షర్మిల.. చంద్రబాబు నివాసానికి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం.. జగన్‌కు చంద్రబాబు బద్ద శత్రువు కావడం. అయితే ఈ సందర్భంగా షర్మిల మాట్లాడిన మాటలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చంద్రబాబుతో సమావేశానికి.. రాజకీయాలకూ ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ఇది సమంజసమే. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. చంద్రబాబుతో రాజకీయాలపై మాత్రం చర్చించలేదు అన్నారు.
రాజారెడ్డి రాజ్యాంగమే..
కావొచ్చు.. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి వెళ్లి రాజకీయాల ప్రస్తావన తీసుకురాకపోయి ఉండొచ్చు. తన తండ్రి కూడా తమ కుటుంబంలో జరిగిన వివాహాలకు చంద్రబాబును ఆహ్వానించారని.. ఆయన వచ్చి ఆశీర్వదించారని తెలిపారు. ఇది కూడా నిజమే. ఇతర నేతలకు పంపినట్లే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు క్రిస్మస్ కేకు పంపానని షర్మిల తెలిపారు. అయితే అందరం పని చేసేది ప్రజల కోసమేనని.. రాజకీయాల్లో ఫ్రెండ్లీ నేచర్ ఉండాలని అన్నారు. ఇది సాధ్యం కాదు షర్మిలమ్మ. జగనన్న ఫ్రెండ్లీ రాజకీయాలు చేయరు. ఎంతసేపూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలంటారు. మరి అది అమలు చేస్తే ఫ్రెండ్లీ రాజకీయం ఎక్కడుంటుంది? షర్మిలేమో ఇలా.. జగనేమో అలా. అందుకే అంటారు చేతికి ఉన్న వేళ్లన్నీ ఒకేలా ఉండవని..