కాపులు పోయినా కమ్మ కావాలి..
ఏపీలో కీలకమైన జిల్లాలు కొన్ని ఉన్నాయి. అక్కడ గెలిస్తే చాలు.. ఏ పార్టీకైనా విజయం చాలా సులభమవుతుంది. ఇక ఆ జిల్లాలేంటంటే.. ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు. ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో జనసేన ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువ సమయం గోదావరి జిల్లాల్లోనే గడిపేస్తున్నారు. కాపుల మద్దతు కూడగొడుతూ.. జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలతో కలిసి పని చేసేలా మోటివేట్ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీకి ఏమాత్రం పట్టు లేకుండా చేస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత జగన్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. కాపులతో పెట్టుకుంటే పని కాదని కమ్మ సామాజిక వర్గంపైకి తన ఫోకస్‌ను షిఫ్ట్ చేశారు.
టీడీపీ నేతలు క్యూ కడతారు..
ఈ క్రమంలోనే ఉమ్మడి విజయవాడ, గుంటూరుపై జగన్ దృష్టి సారించారు. గోదావరి జిల్లాల్లో వైసీపీ పుట్టి మునిగిపోతుందని గ్రహించిన జగన్ మంచి స్టెప్పే తీసుకున్నారు. కాపులు దూరమైనా కమ్మలను కలుపుకుని ముందుకు సాగాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా విజయవాడ సీటును ఎవరికీ కేటాయించకుండా హోల్డ్‌లో పెట్టి మరీ విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని తన వద్దకు రప్పించుకున్నారు. త్వరలో ప్రత్తిపాటి పుల్లారావు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని టాక్ నడుస్తోంది. కేశినేని నాని చేరికతో ఇక తమ పార్టీలోకి టీడీపీ నేతలు క్యూ కడతారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కేశినేని నాని వర్గానికి చెందిన నేతలైతే పక్కాగా వైసీపీలో చేరుతారు. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీకి టచ్‌లో లేరని సమాచారం.
పవన్‌ను కలిసి షాక్ ఇచ్చారు..
మొత్తానికి చూస్తే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలపై జగన్ ఫోకస్ పెడతారని సమాచారం. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పోయినా కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ సీట్లు తమ ఖాతాలో వేసుకునేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు.. అంబటి రాయుడు లాంటి వారు ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. కేవలం క్రికెట్‌కే పరిమితమవుతానన్న అంబటి రాయుడు సడెన్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి షాక్ ఇచ్చారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి వైసీపీని వీడారు. ఈ క్రమంలోనే మంత్రి పార్థసారధి కూడా నిష్ర్కమించారు. త్వరలో మరికొందరు నేతలు కూడా పార్టీ మారవచ్చని సమాచారం. పోయేవాళ్లు పోతున్నారు.. వచ్చే వాళ్లు వస్తున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ నేతలు పార్టీలు మారడంతో ఎవరికి ప్లస్ అవుతుందో.. ఎవరికి మైనస్ అవుతుందో తెలియడం లేదు.