పేరులోనే అంతా ఉంది.. మార్చేయండి ప్లీజ్
పేరులో ఏముందిలే అనుకుంటాం. పేరేమైనా తలరాత మారుస్తుందా? అనుకుంటాం. కానీ అంతా అలా అనుకోరు కదా. అలా అనుకునేలా అయితే పుట్టగానే జాతకాలు చూపించి ఏ అక్షరంతో పేరు పెడితే బాగుంటుందని.. ఎందుకడుగుతారు? ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తున్నారు. పేరుతోనే మనిషి జాతకం మారుతుందని భావిస్తున్నప్పుడు పేరుతో పార్టీ తలరాత ఎందుకు మారదని ఓ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ నేతలెవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును.. బీఆర్ఎస్సే. జాతీయ పార్టీగా మలిచి టీఆర్ఎస్‌ను కాస్త బీఆర్ఎస్‌ను చేస్తే జాతీయం సంగతేమో కానీ ప్రాంతీయంగానూ.. పత్తా లేకుండా పోయింది.
మరక మంచిదే అన్నట్టుగా..
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ భావించారు. అప్పుడే చాలా మంది సూచించారు. అసలు తెలంగాణ సెంటిమెంట్ అంతా టీఆర్ఎస్‌లోనే ఉంది. దానిని మార్చేస్తే చిక్కుల్లో పడతామని.. కానీ కేసీఆర్‌కి అది ఎక్కలేదు. మరక మంచిదే అన్నట్టుగా మార్పు కూడా మంచిదనుకున్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బొక్క బోర్లా పడింది. దీనికి కారణాలను అన్వేషించిన పార్టీ నేతలకు పార్టీ పేరు మార్పు కూడా ఒక కారణంగానే అనిపిస్తోంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.. కాకపోతే కాస్త సుతిమెత్తగా చెబుతున్నారు.
పేరు మార్చుతో ఒకట్రెండు శాతం ఓట్ల నష్టం..
తాజాగా పార్టీ అంతర్గత సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్లంతా పాల్గొన్నారు. ఈ సమావేశంలోన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కడియం శ్రీహరి పార్టీ పేరు మార్పుపై తన మనసులోని మాట బయటపెట్టారు. టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్‌గా మార్చడం వలన సుమారుగా పార్టీ ఒకటి నుంచి రెండు శాతం ఓట్లను నష్టపోవాల్సి వచ్చిందన్నారు. పార్టీ పేరులోనే తెలంగాణ సెంటిమెంట్ ఉండటంతో పోటీ చేసిన ఏ ఎన్నికల్లోనూ ఇబ్బందిర పరిస్థితులను ఎదుర్కొన్నది లేదు. కానీ పేరు మార్చాక నిజంగానే సీన్ మారింది. అయితే అప్పటికే బీఆర్ఎస్ మీద ప్రజల్లో అసహనం ఏర్పడిందనడంలో సందేహం లేదు. కేసీఆర్ అహంకారానికి కూడా చెక్ పెట్టాలనే నిర్ణయానికి జనం వచ్చారు. ఇప్పుడు పేరు మారిస్తే అయినా తలరాత మారుతుందని నేతలు భావిస్తున్నారు.