కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం రేవంత్ రెడ్డియేనని చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుని.. తెలంగాణ ఇచ్చి పార్టీ కాంగ్రెసేనని జనాల్లోకి తీసుకెళ్లి ఎలాగైతేనేం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తెలంగాణకు చెందిన సీనియర్స్ అందరినీ కూడా కలుపుకుని పోతున్నారు. ఇక రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి దాదాపు 40 రోజులవుతోంది. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా రేవంత్ రెడ్డితో కిషన్‌రెడ్డి ఓ ఒప్పందం చేసుకున్నారని టాక్ నడుస్తోంది.
అసలేంటి ఒప్పందం?
గత లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కిషన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ‘ఈ సారి నా కోసం సికింద్రాబాద్‌లో వీక్ క్యాండిడేట్ పెట్టు.. మల్కాజ్‌గిరిలో నీ సిట్టింగ్ సీటు వదిలేస్తా, నీ పరువు కాపడతా... నీ కోసం బీజేపీ తరపున వీక్ కాండిడేట్ పెడతా..’ అని రేవంత్ రెడ్డితో కిషన్ రెడ్డి క్విడ్ ప్రోకో ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కాబట్టి వీరిద్దరూ కలవడంలో వింతేమీ లేదంటున్నారు. ప్లాన్‌లో భాగంగా మల్కాజ్‌గిరి సీటు లోకల్ వారికే ఇవ్వాలని బీజేపీ నాయకులు.. రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, కొంపల్లి మోహన్ రెడ్డి వరుస ప్రెస్‌మీట్లు పెడుతున్నారని టాక్.
తెలంగాణలో పెద్దగా పట్టు లేని బీజేపీతోనా?
ఇంతవరకూ బాగానే ఉంది.. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. అన్ని పార్టీలూ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓ ఆసక్తికర ప్రచారం ఊపందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి మధ్య క్విడ్‌ప్రోకో ఒప్పందం జరిగిందనేది టాక్. అసలు దీనిలో నిజమెంత? అధికారపక్షం నేతలతో ఇలాంటి ఒప్పందాలు ఓకే కానీ.. తెలంగాణలో పెద్దగా పట్టు లేని బీజేపీతోనా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయితే బీజేపీకి అంతో ఇంతో తెలంగాణలో పట్టు ఉండేది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో కిషన్‌రెడ్డితో రేవంత్ రెడ్డి క్విడ్‌ప్రోకో ఒప్పందానికి పాల్పడతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిలో నిజమెంతనేది కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ తెలియదు.