నయనతారకి ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ పెద్ద షాకిచ్చింది. నయనతార లేటెస్ట్ మూవీ అన్నపూరణి డిసెంబర్ 1 న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ చిత్రం గత వారమే నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. అసలు ఓటిటి రిలీజ్‌కి ముందు నుంచే అన్నపూరణిని స్ట్రీమింగ్ చేయవద్దు అంటూ నానా రచ్చ జరిగింది. లవ్ జిహాద్‌ని ప్రోత్సహించేలా ఉందని, హిందూ మత విశ్వాసాలను దారుణంగా దెబ్బ తీసేలా ఈ చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగా తెరకెక్కించారంటూ.. మధురైకి చెందిన కొందరు కేసు పెట్టిన విషయం తెలిసిందే.
అది ఇప్పుడు కీలకమలుపు తిరిగింది. దానితో నయనతార అన్నపూరణిని నెట్ ఫ్లిక్స్ ఆపెయ్యక తప్పలేదు. అన్నపూరణి థియేటర్స్ లో విడుదలైనప్పుడు కొంతమేర ఈ చిత్రంపై నెగిటివిటీ కనిపించినా.. అంత పెద్ద ప్రాబ్లెమ్ అవ్వలేదు. కానీ అన్నపూరణి ఓటిటిలోకి వచ్చాకే అసలు ప్రాబ్లెమ్ మొదలైంది. అటు కేసు, ఇటు రాజకీయ పార్టీలు అన్నపూరణిని బ్యాన్ చేయాలని ఎత్తుకున్న నినాదంతో నెట్ ఫ్లిక్స్ ఈ చిత్ర స్ట్రీమింగ్‌ని ఆపేసింది. ఒక బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ బిర్యానీ వండేందుకు తాపత్రయపడటం, రుచి బాగా రావాలని బురఖా వేసుకుని నమాజ్ ఇవన్నీ చాలామందికి రుచించలేదు.
దానితో నయనతార చిత్రానికి బిగ్ షాకిస్తూ నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది తాత్కాలికంగా ఆపేశారా?.. లేదంటే పూర్తిగా తొలగించారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఓ రకంగా ఇది నయనతారకి, ఆ చిత్ర టీమ్‌కి పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి.