గత ఏడాది ఎక్సట్రార్డినరీ మ్యాన్ మూవీ తర్వాత నితిన్ తమ్ముడు మూవీ మొదలు పెట్టి సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్నాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ గత ఏడాది తమ్ముడు మూవీని మొదలు పెట్టాడు. తాజాగా ఈ మూవీ సెట్స్ లో నితిన్ కి ప్రమాదం జరగగా, వెంటనే షూటింగ్ ఆపేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రలోని మారేడుమిల్లు అడవుల్లో షూటింగ్ జరుపుకుతున్న తమ్ముడు సెట్స్ లోనే నితిన్ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది.
భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో నితిన్ గాయపడ్డాడు అని.. వెంటనే నితిన్ ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇప్పించి హైదరాబాద్ కి పంపేశారని.. ఆ తర్వాత తమ్ముడు షూటింగ్ ని ఆపేసినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన నితిన్ కి మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించినట్లుగా తెలుస్తుంది.