ధరణి, రిటైర్డ్ అధికారులపై రేవంత్ ఫోకస్
రేవంత్ రెడ్డి సీఎం సీటును అధిరోహించాక తెలంగాణలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజాపాలన తీసుకొస్తామన్న రేవంత్ సర్కార్ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. నిజానికి అప్పటి ప్రభుత్వం ఎందుకోగానీ రిటైర్ అయిపోయిన అధికారులకు సైతం ఎక్స్‌టెన్షన్ ఇచ్చి మరీ కొనసాగించింది. దీనిని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఇప్పుడు అదే తప్పును తిరిగి చేయకూడదు కదా. అందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొందరిపై వేటు వేసింది. మరికొందరు ముందుగానే తప్పుకున్నారు.
వివిధ హోదాల్లో ఉన్నతాధికారులు..
నిజానికి రిటైర్డ్ అయిన వారిని సైతం కొనసాగించడమంటే ప్రభుత్వ ఖజానాపై కావల్సినంత భారం మోపడమే. సర్వీస్ పొడిగింపు అనేది జరిగిందంటే మాత్రం ఆయా అధికారులు ప్రభుత్వానికి ఫేవర్‌గా ఉంటారు. ఇలా ఉండటం వల్ల అవినీతికి ఆస్కారముందనేది రేవంత్ ప్రభుత్వ వాదన. దీనిలో నిజం లేకపోలేదు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఇరిగేషన్ శాఖలోనే ఐదుగురు ఉన్నతాధికారులు వివిధ హోదాల్లో ఉన్నారట. వాళ్ల వివరాలను సైతం రేవంత్ ప్రభుత్వం వెల్లడించింది. అలాగే పంచాయతీ రాజ్ శాఖలోనూ ఒక ఉన్నతాధికారి ఉన్నారట. ఈ శాఖల్లో మాత్రమే కాకుండా మరికొన్ని శాఖల్లోనూ రిటైర్డ్ ఐఏఎస్‌లు వివిధ శాఖల్లో కొనసాగుతున్నట్టు తెలిపింది.
ఐదుగురు సభ్యులతో కమిటీ..
ఇక ధరణి పోర్టల్ కారణంగా ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కారణంగా తమ పేర్లను దానిలో రిజిస్టర్ చేయించుకోలేక పోతున్నామంటూ రైతులు సైతం ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ పని తీరుపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనికి త్వరలోనే పరిష్కార మార్గం చూపాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. గతంలో రేవంత్ ప్రకటించిన మాదిరిగానే ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలు.. వాటిని సరి చేయడం ఎలా? వంటి అంశాలపై అధ్యయనం చేసి ధరణి పోర్టల్ రూపురేఖలను సమూలంగా మార్చేయనున్నారు. మొత్తానికి ప్రజాపాలన కోసం రేవంత్ చాలా శ్రమిస్తున్నారనడంలో సందేహమే లేదు.