రాష్ట్రమంతటా 2050 నాటికి పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో ‘మెగా మాస్టర్ పాలసీ–2050’ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అద్భుతం.. అలాగే తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించాలనే ఆలోచన కూడా భేష్. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మహా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు ఇది ఇంకా అదుర్స్. హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలని భావించడం కేకో కేక. నిజానికి ఒక సీఎంకు ఇంతకు మించి ఏం కావాలి? అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందితే తద్వారా ఆ అక్కడ ఉండే ప్రజానీకమంతా అన్ని రకాలుగా బాగుంటుంది.
పబ్లిసిటీ వస్తుందని శ్రీధర్‌బాబుని సైడ్ చేశారా?
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ సూపర్బ్. కానీ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎక్కడా? ఏమైపోయారు? కంపెనీ ప్రతినిధులను కలుస్తున్న సమయంలో రేవంత్ లేకున్నా ఓకే కానీ ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉండాలి కదా? గడిచిన నెల రోజుల్లో 5 సార్లు ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లేకుండానే కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. ఐటీ, ఇండస్ట్రీస్ శాఖలో పెట్టుబడులు తీసుకొస్తే పబ్లిసిటీ వస్తుందని ఆ శాఖ మంత్రిని సైడ్ చేసి రేవంత్ రెడ్డి క్రెడిట్ కోసం చూస్తున్నారని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. పరిశ్రమల శాఖ ముఖ్య సమీక్షా సమావేశంలోనూ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కనిపించకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇంత మాత్రానికే ఆ శాఖ ఇవ్వడమెందుకు?
ఈ వ్యవహారంపై బయట చర్చ ఓ రేంజ్‌లో జరుగుతోంది. చివరకు కమ్యూనిటీని కూడా లాగి విమర్శలు గుప్పిస్తున్నారు. దళిత మంత్రిని రేవంత్ కావాలనే తొక్కేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంత మాత్రానికే ఆయనకు శాఖ ఇవ్వడమెందుకు? దానిని కూడా రేవంత్ దగ్గరే పెట్టుకోవచ్చు కదా అని జనం మండిపడుతున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకుంటున్న రేవంత్ ఈ విషయంలో మాత్రం విమర్శకులకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? గడిచిన నెల రోజుల్లో 5 సార్లు జరిగిన కంపెనీ ప్రతినిధుల సమావేశాల్లో ఇండస్ట్రీస్ మంత్రి కనిపించకుంటే ఎలా? ఎందుకు రేవంతే ముందుండి అవన్నీ చక్కబెడుతున్నారు? ఇక ముందు ఇలాంటి విమర్శలకు రేవంత్ తావివ్వకూడదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.