నిన్నటి వరకూ ఇంటా బయటా పల్లకీల మోత.. దీంతో నాలుగున్నరేళ్ల సమయం హాయిగా గడిచిపోయింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. గిర్రున తిరిగొచ్చింది. టైం రివర్స్ అయ్యింది. మనకున్న ఏకైక అడ్డు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేశామని సంబరపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల మౌనం జగన్‌కు మరింత బలం ఇచ్చింది. కోర్టు కేసులు వచ్చేసి డైలీ సీరియల్ మాదిరిగా ఏళ్లకేళ్లు సాగుతూనే ఉన్నాయి. ఇంకేముంది? తిరుగేలేదనుకున్నారు. సిట్టింగ్‌లకే సీట్లన్నీ అని ప్రకటించేశారు. ఎమ్మెల్యేలంతా హ్యాపీ.
గీత దాటరనుకున్న నేతలంతా జంప్..
సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక కుదుపు మాదిరిగా వరుసబెట్టి చాలా కుదుపులు వచ్చాయి. ఎన్నికల వరకూ చంద్రబాబును బయటకు రానివ్వొద్దంటే 50 రోజులకే బయటకు వచ్చేశారు. తెలంగాణలో కొండంత బలంగా ఉందనుకున్న బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఇదేంటి చెప్మా అని.. చకచకా బీఆర్ఎస్ ఓటమికి కారణాలపై విశ్లేషణ చేసి అనువుగా ఉన్న కారణాన్ని తీసుకుని వరుసబెట్టి ఎమ్మెల్యేల మార్పునకు శ్రీకారం చుడితే అది కాస్తా రివర్స్ అయి కూర్చొంది. నేను గీసిన గీత దాటరనుకున్న నేతలంతా అవలీలగా దాటేస్తున్నారు. పోనీలే స్థాన మార్పిడి అయినా చేస్తే పడుంటారనుకుంటే అదీ కష్టంగానే మారింది.
బయటంతా వ్యతిరేక పవనాలే..
ఒకప్పుడు తన ఫోటో కనిపిస్తే చాలు ఓట్లు రాలతాయన్న జగన్మోహన్ రెడ్డి మాట మార్చేశారు. ఒకవేళ ఓటమి ఎదురైతే మీ కారణంగానేనంటూ తమ పార్టీ ప్రజాప్రతినిధుల వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ జగన్ రాంగ్ ట్రాక్‌లోకే వెళుతున్నారు. తెలంగాణ నుంచి తెలుసుకోవాల్సిన అసలు విషయాన్ని విస్మరించి కొసరు విషయాన్ని పట్టుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలోనూ ఆవేశపడ్డారు. తొందరపాటు నిర్ణయాలు ఇలాంటివెన్నో తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు బయట కూడా వ్యతిరేకంగా మారిపోయాయి. పొత్తులతో పార్టీలు దూసుకెళుతున్నాయి. జగన్ సొంత చెల్లే ఆయనకు ఎదురెళ్లేందుకు సిద్ధమయ్యారు. పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీలు సహా ప్రభుత్వోద్యోగులు, నిరుద్యోగులు అంతా వ్యతిరేకమయ్యారు. ఇంత వ్యతిరేకతను ఎదుర్కొని వైసీపీ నిలబడుతుందో.. చతికలబడుతుందో కాలమే చెప్పాలి.