గుంటూరు కారం సంక్రాంతి సంబరాలు షురూ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ హడావిడి మొదలయ్యింది. అవ్వుద్దో.. లేదో అనుకున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేడు గుంటూరులో అట్టహాసంగా జరిగింది. అసంఖ్యాక అభిమానుల నడుమ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఈ వేడుకలో ఓ సినిమా కోసం నూటికి, రెండొందల శాతం కష్టపడే ఏకైక నటుడు మహేష్ మాత్రమేనని కితాబిచ్చారు త్రివిక్రమ్. తన స్పందన ట్విట్టర్ లో చూడండంటూ, సక్సెస్ మీట్ లో మాట్లాడతాను అంటూ ముగించారు థమన్. ఇక నిర్మాత చినబాబు, నాగ వంశీ, హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి వంటి తదితరులందరూ కూడా గుంటూరు కారం పట్ల తమకున్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు, అభిమానుల్లో జోరు పెంచారు.
అయితే అక్కడున్న యావన్మందిని మైక్ పట్టుకున్న క్షణం నుంచే తన మాటలతో హత్తుకున్నారు మహేష్. ఎక్కువ ల్యాగ్ లేకుండా, ఎప్పటెప్పటి విషయాలో చెప్పకుండా నేరుగా అసలు మేటర్ లోకే వచ్చేసిన మహేష్ కష్టకాలంలో తనకి తోడుగా ఉన్నారంటూ త్రివిక్రమ్ కి లవ్ యు చెప్పారు. గుంటూరు కారంలో కొత్త మహేష్ ని చూస్తారంటూ ప్రకటించారు. శ్రీలీల తో డాన్స్ చెయ్యడం మాటలు కాదంటూ నవ్వులు పూయించి మడతపెట్టే సాంగ్ తో థియేటర్స్ దద్దరిల్లుతాయని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇక మీనాక్షి చౌదరి, థమన్ మరియు ఇతర సాంకేతిక నిపుణులందరి గురించి కూడా చక చకా మాట్లాడిన మహేష్ అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ మాత్రం కాస్త ఉద్వేగానికి లోనయ్యారు.
గుంటూరు లో ఈ సినిమా వేడుక జరుపుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని చెబుతూ తమ స్వస్థలం గుంటూరు అనే సంగతి గుర్తు చేసుకున్నారు. సంక్రాంతి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టడం నాన్నగారి నుంచి వస్తోన్న ఆనవాయితీ అంటూ ఈ సంక్రాంతికి ఇంకా గట్టిగా కొడుతున్నామని దృఢంగా చెప్పారు. ఇదే ప్రస్తావనలో తన తండ్రి సూపర్ స్టార్ మరణం పట్ల కాస్త భావోద్వేగానికి లోనైన మహేష్ తన సినిమాల రిలీజ్ టైమ్ లో రికార్డ్ ల గురించి, కలెక్షన్స్ గురించి నాన్నగారు ఆనందంగా చెబుతూ ఉంటే వినేవాడినినని, ఆయన ఫోన్ కాల్ కోసం వెయిట్ చేసే వాడినని జీర గొంతుతో చెప్పిన మహేష్.. ఇక నుంచి ఆ బాధ్యత మీరే తీసుకోవాలంటూ, మీరే చెప్పాలంటూ.. అభిమానులను ఉద్దేశించి అనడం అక్కడున్న ఫాన్స్ నే కాదు.. ఆ వేదికపై ఉన్న అందరిని మాత్రమే కాదు పలు మాధ్యమాల ద్వారా ఆ వేడుకని వీక్షించిన ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇన్నేళ్ల నా కెరీర్ లో తోడుగా ఉన్న మీ అందరికి నేను మాటల్లో కృతఙ్ఞతలు చెప్పలేను అంటూ చేతులెత్తి నమస్కరించడం మహేష్ బాబు స్వభావానికి అద్దం పట్టింది.
ఇలా చిన్న ప్రసంగంతోనే పెద్ద ఇంపాక్ట్ ఇచ్చి అందరిని ఇంప్రెస్స్ చేసేసిన మహేష్.. రమణ కేరెక్టర్ లో ఎంత రంజుగా కనిపించాడో, ఎంతగా కనువిందు చెయ్యనున్నాడో మనందరికి మరికొన్ని గంటల్లోనే చూపించెయ్యబోతుంది గుంటూరు కారం.