ఇప్పుడు ఏపీలో ఆసక్తికర విషయాన్ని వైసీపీ తెరమీదకు తీసుకొచ్చింది. ఈసారి తామే గెలుస్తామనడానికి 2009 నాటి ఉదాహరణలు తీసుకొచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కంపేర్ చేసుకుని ఈసారి పక్కాగా వైసీపీదే విజయమని తేల్చేస్తున్నాయి. వైఎస్ జగన్‌దే విజయమని చెప్పడానికి ఎప్పటెప్పటి పరిస్థితులనో వెలికి తీస్తున్నాయి. 2009లో అప్పటి కాంగ్రెస్ పాలనపై జనంలో కొంత వ్యతిరేకత అయితే వచ్చింది. ఆ సమయంలోనూ ప్రతిపక్షంగా టీడీపీయే ఉంది. ఇది అప్పట్లో ఓటమి నుంచి కోలుకుని తిరిగా బాగానే పుంజుకుంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ జతకట్టాయి.
ప్రభుత్వోద్యోగుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విముఖత లేదు..
టీడీపీ కూటమిలో కమ్యూనిస్టులు, అప్పటి టీఆర్ఎస్ పార్టీలు చేరిపోయాయి. అప్పడే ప్రజారాజ్యం పార్టీ కూడా పుట్టింది. అప్పటి కాంగ్రెస్ పార్టీని కంప్లీట్‌గా బ్లాక్ చేశాయి. అయినా సరే.. వైఎస్సార్ చేపట్టిన కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ఆయన గట్టెక్కారు. కాంగ్రెస్ పార్టీకి 157 సీట్లు రాగా.. టీడీపీ కూటమికి 92 సీట్లు వచ్చాయి. ఇది అసలు కథ. అప్పట్లో ప్రభుత్వోద్యోగుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విముఖత లేదు. నిరుద్యోగుల్లో నైరాశ్యమూ లేదు. ఒకేసారి 50 వేల ఉద్యోగాలను తీశారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందరికో ఉద్యోగాలొచ్చాయి. ఈ ఒక్క అంశం చాలదా.. పార్టీని గట్టెక్కించేందుకు. 50 వేల కుటుంబాలతో పాటు సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి కుటుంబాలు అండగా నిలిచాయి.
అంత కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు...
అప్పటి కాంగ్రెస్‌తో పోల్చుకుని ఇప్పుడు వైసీపీ వాతలు పెట్టుకుంటోంది. ఎంత వ్యతిరేకత ఉన్నా.. ఎందరు కూటములు కట్టినా మాదే విజయమని విర్రవీగుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూశాక అయినా అహంకారం పక్కనబెట్టాలనే విషయాన్నే తెలుసుకోలేకుంటే ఎలా? ఎప్పటివో ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుని నాటి పరిస్థితులను చూడకుండా వైఎస్ గట్టెక్కారు కాబట్టి తాను కూడా గట్టెక్కుతాననుకుంటే అంత కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. విపక్షాల మధ్య ఓట్లు చీలకపోతే వైసీపీ ఇబ్బందులో పడటం ఖాయం. కానీ ఇప్పుడు చీలే పరిస్థితులు కూడా లేవు. ప్రజల్లో వ్యతిరేకత కాస్త తక్కువగా ఉన్నా వైసీపీకి అవకాశం ఉంటుందేమో కానీ ఆ ఛాన్స్ కూడా లేదు. మొత్తానికి వైసీపీ క్లీన్ బౌల్డ్ అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.