ఏపీ రాజకీయాల్లో ఏ చిన్న మార్పు జరిగినా.. ఏ చిన్న వివాదం తలెత్తినా ముందుగా మీడియా ఎదుట అన్ని శాఖల మంత్రి సజ్జల ప్రత్యక్షమవుతారు. పార్టీని వెనుకేసుకొస్తూ ఏదేదో మాట్లాడేస్తారు. కానీ ఆ తరువాత అడ్డంగా పార్టీని ఇరుకున పెట్టేస్తారు. ఇప్పుడు వైఎస్ షర్మిల విషయంలోనూ అదే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా చెల్లెలైన షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ వైఎస్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందోనని వైసీపీ అధిష్టానం భయపడింది. ఆ వెంటనే ఆమెను ఎదుర్కొనేందుకు సమాలోచనలు చేసి మరీ సజ్జలకు మీడియా ముందుకు పంపించింది.
డ్యామేజ్ కంట్రోల్ చేశారా.. పెంచారా?
షర్మిలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ట్యాగ్ చేయడం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవచ్చని వైసీపీ అధిష్టానం భావించింది. అదే విషయాన్ని సజ్జలకు చెప్పి మీడియా ముందుకు వదిలింది. మొత్తానికి అసలు విషయాన్ని చెప్పి.. అంతటితో ఆగక అంతకు ముందు కాంగ్రెస్‌లో వైఎస్ వివేకా ఉన్నారు. ఏమైందో చూశారని వ్యాఖ్యానించారు. అంటే షర్మిలకు కూడా వైఎస్ వివేకాకు పట్టిన గతే పట్టుద్దని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేసినట్టేనని నెటిజన్లు ఈ వీడియోను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. మొత్తానికి సజ్జల తనకు తోచింది అయితే చెప్పారు కానీ నెటిజన్లు తీసుకునేది తీసుకున్నారు. డ్యామేజ్ కంట్రోల్ చేశారా? పెంచారా? అనేది సజ్జలే చెప్పాలి.
వెల్లువెత్తుతున్న మీమ్స్..
ఇక ఆ తరువాత జగన్‌ను సింగిల్‌గా ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌ని తెచ్చుకున్నారని.. అలాగే షర్మిలను రాజకీయాల్లోకి రప్పించారని సజ్జల అన్నారు. ఈ విషయాలన్నీ లైట్.. వివేకాకు పట్టిన గతే షర్మిలకు పట్టడమేంటి? అంటే షర్మిలను కూడా.. అన్నట్టుగా సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. షర్మిలను నేరుగా విమర్శించకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏదో లైన్ ఇస్తారనుకుంటే.. మొత్తానికే పార్టీని ఇరుకున బెట్టేశారు సజ్జల. అసలు సజ్జల మాట్లాడిన దానిపై స్పందిస్తే ఒక చావు.. స్పందించకుంటే మరో చావు అన్నట్టుగా మారింది వైసీపీ అధిష్టానం పరిస్థితి. వైసీపీకి కామ్‌గా ఉండటం తప్ప మరో అవకాశమే లేనట్టుగానే ఉంది వ్యవహారం.