వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ రాని నేతలంతా పార్టీకి రివర్స్ అవుతున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. పార్టీని వీడుతున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాజకీయాలకు కొంతకాలం పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. కాబట్టి పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. మరోవైపు కాపు నేతలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయవచ్చనుకున్నారు. కానీ అది కూడా కుదరడం లేదు. కాపు నేత హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా లేఖలు రాస్తున్నారంటూ హడావుడి చేశారు. ఒక ఫైన్ మార్నింగ్ ఆయన తానే లేఖలు రాయడం లేదని స్పష్టం చేశారు.
ఎమోషనల్ అయిన కాపు రామచంద్రారెడ్డి..
ఇక ఎమ్మెల్యేలు సైతం పార్టీకి రివర్స్ అవుతున్నారు. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి జగన్‌కు రివర్స్ అయ్యారు. జగన్ తనను పక్కన పెట్టి తన సొంత వర్గానికి చెందినవారికి టికెట్ ఇవ్వబోతున్నారని తెలుసుకొని రామచంద్రారెడ్డి ఒకింత ఎమోషనల్ అయ్యారు. తాను జగన్‌ను నమ్మి వైసీపీలో చేరి విధేయుడిగా ఉన్నానని.. ఆయన మాట ఎన్నడూ జవదాటలేదని.. అయినా తనకు టికెట్ ఇవ్వకుండా గొంతు కోసేందుకు సిద్ధమయ్యారని రామచంద్రారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని.. ఆ విషయంలోనూ తనను మోసం చేశారన్నారు. పోనీలే ఏదో ఒక రోజున తనకు న్యాయం జరుగుతుందనుకుంటే ఆ ఆశే లేకుండా చేస్తున్నారన్నారు.
పోటీ నుంచి తప్పుకోవడానికైనా సిద్ధం కానీ..
ఇక తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సైతం తాను పోటీ చేయబోనంటూ సంకేతాలిచ్చారు. తనకు నరసరావుపేట టికెట్ ఇస్తేనే చేస్తానని లేదంటే చేయబోనని స్పష్టం చేశారు. ఈ సారి నరసరావుపేట స్థానాన్ని లావు శ్రీకృష్ణ దేవరాయలకు ఇచ్చేందుకు జగన్ నిరాకరించారట. ఆయనను గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. తాను పోటీ నుంచి తప్పుకోవడానికైనా సిద్ధం కానీ గుంటూరు నుంచి మాత్రం పోటీ చేసేదే లేదని ఆయన స్పష్టం చేశారట. లావు శ్రీకృష్ణ దేవరాయలకు గుంటూరు స్థానాన్నే కేటాయించాలని ఆ లోక్‌సభ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు సూచించినా జగన్ వినే పరిస్థితి లేదట. దీంతో లావు సైతం పట్టుబట్టి కూర్చొన్నారు. తన స్థానాన్ని తనకు ఇస్తే సరే సరి.. లేదంటే పోటీ నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారట.