జనసేనకు 35.. పవన్ పోటీ ఇక్కడినుంచే!!
వైసీపీ నేతలు జనసేన కేడర్‌ను రెచ్చగొడుతున్న అంశం సీట్ల పంపకం. తప్పనిసరిగా జనసేనకు టీడీపీ అన్యాయమే చేస్తుందంటూ ఆ పార్టీ కేడర్‌ను వైసీపీ నేతలు తెగ రెచ్చగొడుతున్నారు. అసలు సీట్ల పంపకం ఎప్పుడు జరుగుతుందా? జనసేన కేడర్‌ను మరింత రెచ్చ గొట్టేందుకు సమయం ఎప్పుడు దొరుకుతుందా? అని వైసీపీ నేతలు గోతికాడ నక్కల మాదిరిగా కాచుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది. కానీ రెచ్చగొట్టడానికి వైసీపీకి ఛాన్స్ అయితే లేదనే తెలుస్తోంది. ఎందుకంటే జనసేనకు మంచి ఫిగర్‌నే టీడీపీ ఇచ్చింది. ఎంపీ సీట్లు, ఇటు అసెంబ్లీ స్థానాల విషయంలో ఎలాంటి లోటు రానివ్వలేదు.
పిఠాపురం నుంచి పవన్ పోటీ?
తాజాగా తెలుగుదేశం పార్టీ, జనసేనల పొత్తులో భాగంగా సీట్ల పంపకం వ్యవహారం పూర్తైనట్టుగా తెలుస్తోంది. జససేనకు 35 అసెంబ్లీ స్థానాలు చంద్రబాబు ఇచ్చినట్టు సమాచారం. అలాగే 3 ఎంపీ సీట్లను సైతం దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక జనసేన అధినేత పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్న విషయంలో కూడా స్పష్టత వచ్చినట్టుగా సమాచారం. ఆయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారట. ఇన్నాళ్లూ పవన్ కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగింది.జనససైనికులు కూడా అదే భావించారు.
కాకినాడకు మకాం అంటూ వార్తలు..
ఈ క్రమంలోనే పవన్ కాకినాడకు తన మకాంను మార్చబోతున్నారంటూ టాక్ నడిచింది. తన కోసం ఒక ఇల్లు చూడమని కూడా జనసేన నేతలకు పవన్ సూచించినట్టుగా వార్తలొచ్చాయి. దీనికి కారణం లేకపోలేదు. పవన్ వరుసగా మూడు రోజుల పాటు కాకినాడలోనే మకాం వేయడం.. జనసేన నేతలు, కేడర్‌తో చర్చలు జరపడం.. ఆపై మరో మూడు రోజుల పాటు కాకినాడలో ఇంటర్నల్ మీటింగ్స్ నిర్వహించాలని జనసేనాని భావించడం వంటి విషయాలు ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. కానీ తాజాగా ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.