ఉభయ గోదావరి జిల్లాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టు బిగించబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. ఏపీలో ఏ పార్టీ విజయం సాధించాలన్నా ఈ ఉభయ గోదావరి జిల్లాల చలవ తప్పనిసరి. ఇక్కడ జనసేన పార్టీకి మంచి పట్టుంది. ఈ విషయాన్ని గ్రహించిన వైసీపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని తమ పార్టీలోకి లాగేసి కాపులను తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తోంది. విషయాన్ని గ్రహించిన పవన్.. ఇటీవల మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేసి తమ పార్టీ నాయకులు, కేడర్‌తో చర్చలు నిర్వహించారు.
మూడు రోజుల పాటు ఇంటర్నల్ మీటింగ్స్..
టీడీపీతో సమన్వయం చేసుకుంటూ వెళ్లేలా కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. అంతేకాకుండా మళ్లీ మూడు రోజుల పాటు పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ నిర్వహించాలని పవన్ భావిస్తున్నారు. గత పదిహేను రోజుల వ్యవధిలో తన సమయాన్ని ఎక్కువగా పవన్ కాకినాడలోనే గడిపారు. పవన్ ఈసారి కాకినాడ నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారమైతే జరుగుతోంది. దీనికి కారణం ఆయన వరుస సమావేశాలు నిర్వహించడమే కావొచ్చు. పైగా ఆయన తన మకాంను కాకినాడకు మార్చుతారని కూడా టాక్. తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. కాబట్టి వారంతా జనసేనకే సపోర్ట్‌గా ఉన్నారు.
రాజకీయ సమీకరణాలన్నీ మారుతాయా?
ముద్రగడతో పాటు కొంత మంది కాపు సామాజిక వర్గ నేతలను లాగేయాలని వైసీపీ చూస్తోంది. ఈ క్రమంలో తాను కాకినాడలో ఉంటే మంచిదని పవన్ భావిస్తున్నారట. తాను కాకినాడ నుంచి పోటీ చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా ప్రభావాన్ని చూపించి జనసేన నేతలను గెలిపించుకోవచ్చని పవన్ భావిస్తున్నారట. ఇప్పటకే కాకినాడలో తనకొక ఇల్లు చూడాలని నేతలకు పవన్ సూచించారట. పవన్ కాకినాడలో ఉంటే రాజకీయ సమీకరణాలన్నీ మారే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ కల్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తారా.. లేదా? ఈసారి కాకినాడపై పవన్ ప్రభావమెంత? అనేది చూడాల్సి ఉంది.