ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్న పొలిటీషియన్ వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీలో తమ వైఎస్సార్‌టీపీని విలీనం చేసి తను కూడా కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారు. ఈ అంశం ఇప్పుడు ఏపీలోని వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. పైకి మాత్రం ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు ఫరక్ పడదని చెబుతున్నా కూడా అంతర్లీనంగా ఎంత భయాందోళన చెందుతున్నారో నీలి మీడియాను చూస్తుంటే అర్థమవుతోంది. ఏపీలో ఉనికిలోనే లేదని చెబుతున్న కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదు. కానీ ఇప్పుడు సడెన్‌గా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు.
వైసీపీకి ఆ పార్టీతో ఇంక పనేంటి?
ఆ పార్టీని తూలనాడుతున్నారు. తమ అధినేత జగన్మోహన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటూ దుయ్యబడుతున్నారు. నోటా కంటే తక్కువ ఓట్లు ఈ పార్టీ నేతలకు వచ్చాయంటూ దారుణాతి దారుణంగా విమర్శలు గుప్పిస్తున్న వైసీపీకి ఆ పార్టీతో ఇంక పనేంటి? ఆ పార్టీలో ఎవరు చేరినా తమకు నష్టం లేదంటూ రాతలు రాయిస్తున్నప్పుడు ఈ రాద్దాంతమంతా ఎందుకు? లైట్ తీసుకుంటే సరిపోలా? కానీ ఇలాంటివి చేసి ఆ పార్టీకి వైసీపీ నేతలే హైప్ క్రియేట్ చేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా ఆ పార్టీ నామ జపం చేస్తున్నారు. వాళ్ల సొంత మీడియాలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కథనాలు రాయిస్తున్నారు.
ఆమె ఒక ఆశాకిరణం..
ఇదిలా ఉండగా.. షర్మిల కాంగ్రెస్‌లో చేరి మంచి పనే చేశారని కొందరు అంటున్నారు. అర్థాంతరంగా తమ పార్టీని గాలికి వదిలేసినా కూడా చివరకు ఆమె మంచి నిర్ణయమే తీసుకున్ానరు. తెలంగాణలో ఆమెను నమ్ముకున్న ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు రోడ్డున పడ్డారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో వారంతా కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఏపీలో కూడా చాలా మంది వైసీపీలో ఇమడలేక టీడీపీ, జనసేనల్లో చేరలేక ఇబ్బందులు పడుతున్న వారికి షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో ఒక ఆశాకిరణంలా మారింది. వారంతా కూడా షర్మిల వెంటే అని చెబుతున్నారు. ఆమె మళ్లీ తెలంగాణకు వెళ్లిపోతానన్నా నష్టం లేదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు.