ఏపీ రాజకీయాలు రాను రాను ఆసక్తికరంగానూ.. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. వైఎస్ఆర్ కుటుంబంలోనూ.. ఇతర రాజకీయ పార్టీల్లోనూ జరుగుతున్న పరిణామాలన్నీ ఆసక్తికరంగానే ఉన్నాయి. అసలు టీడీపీ నేత బీటెక్ రవిని జగన్‌కు స్వయానా బావ, షర్మిల భర్త అనిల్ కుమార్ కలవడనుండటం ఆసక్తికరంగా మారింది. అది కూడా ఇడుపులపాయలోని షర్మిల గెస్ట్ హౌస్‌లో ఈ భేటీ జరగనుంది. అసలు జగన్ పేరెత్తితేనే విరుచుకుపడే బీటెక్ రవితో అనిల్ భేటి ఏంటి? అది కూడా షర్మిల తన తల్లి, కుమారుడితో కలిసి వెళ్లి అన్నను కలిసొచ్చిన కొన్ని గంటలకే. అసలు అనిల్ ఎందుకు జగన్‌ను ఆహ్వానించడానికి వెళ్లలేదు.. అన్నీ జవాబు లేని ప్రశ్నలే.
జగన్‌ను కలిసేందుకు ఆళ్ల ఎందుకు వెళ్లినట్టు?
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక జగన్‌ను కలిసేది లేదన్న కరకట్ట కమల్‌హాసన్ అదేనండి.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. షర్మిలతో కలిసి తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి జగన్ సెక్యూరిటీ చేతిలో అవమానం పాలయ్యారు. ఆ తరువాత అనుమతించారనుకోండి. అయినా ఎందుకు జగన్‌ను కలిసేందుకు ఆళ్ల వెళ్లినట్టు? జవాబు లేని ప్రశ్నే. సొంత అన్నను పెళ్లి ఆహ్వానించడంలో తప్పు లేదు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వెళ్లడానికి ముందు వెళ్లడమే మిలియన్ డాలర్ ప్రశ్న. ఇదంతా ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందాల కారణంగా టీడీపీ అధినేత చంద్రబాబు షర్మిల, ఆర్కేలను ఆ పార్టీలోకి పంపిస్తున్నారంటూ వైసీపీ నేతల కామెంట్స్.
ఆర్కే కోసం చంద్రబాబు మంతనాలు చేస్తారా?
ఇది నిజానికి ఎంత ఫూలిష్ వాదన. చంద్రబాబు ఇదంతా చేయదలిస్తే షర్మిలను తమ పార్టీలోనే చేర్చుకుంటారు కానీ కాంగ్రెస్‌లోకి ఎందుకు పంపిస్తారు? జగన్‌తో కలిసి ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ నాశనానికి ఎంతగా కృషి చేశారు. అమరావతి నాశనం నుంచి చంద్రబాబు కేసులు మోపడం వరకూ ప్రతి దానిలోనూ ఆయన హ్యాండ్ ఉంది. అలాంటిది ఆర్కే కోసం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో మంతనాలు చేస్తారా? మొత్తానికి అంతుబట్టని ప్రశ్నలే ఇబ్బంది పెడుతుంటే ఈ కొత్త ప్రచారాలు జనాలను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. అసలు ఏపీలో ఏం జరుగుతోందో తెలియక తలబట్టుకుంటున్నారు. కారణం లేకుండా అయితే ఎవరూ ఎవరినీ కలవరు. కానీ ఆ కారణాలేంటో మాత్రం బయటకు రావడం లేదు.