పార్టీలన్నింటి స్లోగన్ ఒకటే.. బీజేపీకి మాత్రం కష్టమే..
ఏపీలో ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. మరో మూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చేస్తుంది. ఏం చేసినా ఈ మూడు నెలల్లోనే చేయాలి. ఏపీలోని పార్టీలన్నీ కొత్త నినాదాలను ఎత్తుకుంటున్నాయి. వైసీపీ రెండో విడత నియోజకవర్గాల జాబితాను విడుదల చేసింది. ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయన్న దగ్గర నుంచి బీసీలకే ప్రాధాన్యమంటూ స్లోగన్ అందుకుంది. అటు టీడీపీ సైతం బీసీలకే ప్రాధాన్యమంటోంది. ఇక బీజేపీ ఏమైనా తక్కువ తిన్నదా? తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతే ముఖ్యమంత్రి అని ప్రకటించింది. పార్టీలన్నీ బీసీల భజన చేస్తున్నాయి.
బీజేపీ ఈ స్లోగన్ ఎత్తుకోవడమే..
అయితే ఈసారి బీసీలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఓటు బ్యాంకు ఎక్కువ. వీరు ఎటు నిలిస్తే ఆ పార్టీదే విజయమనడంలో సందేహం లేదు. అందుకే వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ బీజేపీ ఈ స్లోగన్ ఎత్తుకోవడమే హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఇలా అనిపించడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి అసలు ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా సింగిల్‌గా పోటీ చేస్తే ఈ పార్టీకి డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. అలాంటిది బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాననడమే ఆసక్తికరంగా మారింది.
డిపాజిట్లు దక్కించుకోవడం కష్టమే..
తెలంగాణలోనూ బీజేపీ ఇదే స్లోగన్‌ను అందుకుంది. అయితే అక్కడ బీసీ నేత అయిన బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశాకే పరిస్థితులన్నీ మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యనేతలంతా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఏపీలో సైతం బీజేపీ తిరిగి అదే స్లోగన్‌ను అందుకుంది. అయినా సరే.. పొత్తు లేకుంటే బీజేపీ ఇలాంటి స్లోగన్స్ అందుకున్నా కూడా డిపాజిట్లు దక్కించుకోవడం కష్టమే అవుతుంది. ఇప్పటి వరకూ బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు పార్టీ తరుఫున క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిందైతే లేదు. కనీసం పార్టీ అగ్ర నేతల్లో ఒక్క బీసీ కూడా లేరు. అలాంటి పార్టీ బీసీ నినాదాన్ని అందుకుంటే ఉపయోగమేంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.