ఒకప్పుడు వెలిగిపోయిన జాతీయ పార్టీ కాంగ్రెస్.. గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కాంగ్రెస్ గురించే మాట్లాడే ప్రజలు, దేశంలోని దాదాపు 90 శాతం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నపార్టీ.. పదులసంఖ్యలో ముఖ్యమంత్రులు.. అదే సంఖ్యలో గవర్నర్లు.. ఇలాంటి హడావిడి కనిపించేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ దీపం ఎక్కడో కానీ వెలగడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఉనికి కోసం కాంగ్రెస్ ఆరాటపడుతుంది. మరికొన్ని చోట్ల ఉనికి కూడాలేదు. ఆంధ్రప్రదేశ్ ను తమ రాజకీయ ప్రయోజనాలకోసం విడగొట్టిన కాంగ్రెసును సీమాంధ్ర ప్రజలు తమ క్రోధాగ్నిలో భస్మం చేసేసారు.ఎప్పటికి కాంగ్రెస్ ఏపీలో కోలుకునే అవకాశం లేకుండా చేసారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎగిరెగిరిపడిన నాయకులంతా 2019 ఎన్నికల్లో మట్టికరిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆయన కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ ని వదిలి వైస్సార్సీపీ పార్టీ పెట్టి కాంగ్రెస్ కి పుట్టగతులు లేకుండా చేసేసారు.
2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి ఆల్మోస్ట్ ఏపీ ప్రజలు మర్చిపోయారు. కాంగ్రెస్ పేరు తలచుకోవడానికి సైతం కార్యకర్తలు ఇష్టపడడం లేదు. అసలు కాంగ్రెస్ కి పని చేసిన నాయకులు సైతం కాంగ్రెస్ ని పట్టించుకోలేదు. కేంద్ర మంత్రిగా పని చేసిన పల్లం రాజు కాకినాడలో పోటీ చేస్తే 8,640 ఓట్లు వచ్చాయి. ఇంకో కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 9585 ఓట్లు వచ్చాయి . ఇంకో సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1384 ఓట్లు వచ్చాయి.. ఇక్కడ నోటాకు 2340 ఓట్లు రావడం గమనార్హం.
ఇలా చెప్పుకుంటూ పొతే ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు కనీస మర్యాద దక్కలేదు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లు వచ్చినా కూడా ఆంధ్రలో కాంగ్రెస్ కి అస్తిత్వం లేదు, ఇప్పుడు ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆంధ్రాలో నూకలు దొరకవు అనేది ఇక్కడి స్కూలు పిల్లాడిని అడిగినా స్పష్టంగా చెబుతాడు.. కాబట్టి ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేసినా ప్రజలు ఆ విషయం చర్చించుకునే సీన్ లేదు.