తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగింది. ఆపై ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. ఆ తరువాత ఆయన డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లి చాలా రోజులవుతోంది. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత కేసీఆర్‌ను చాలా మంది నేతలు పరామర్శించారు. ఒక్క వైసీపీ నేతలు మినహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నేతలూ కేసీఆర్‌ను పరామర్శించారు. అయితే తెలంగాణ ఎన్నికల వరకూ కేసీఆర్‌తో అంటకాగిన జగన్ కనీసం పరామర్శించకపోవడం.. సోషల్ మీడియాలోనైనా గెట్ వెల్ సూన్ అంటూ ఒక మెసేజ్ పెట్టకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇన్ని రోజుల తర్వాతా?
కాలక్రమేణా జగన్ పరామర్శ గురించి అంతా మరిచిపోయారు. కానీ సడెన్‌గా జగన్మోహన్‌రెడ్డికి కేసీఆర్‌ని పరామర్శించాలనిపించింది. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్‌కు పయనం కాబోతున్నారు. ఇదేంటి ఇన్ని రోజుల తర్వాతా? కేసీఆర్ ఆసుపత్రిలో ఉండగా.. రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వెళ్లి ఆయనను పరామర్శించారు. కానీ జగన్ మాత్రం ఇంటికి వచ్చాక కూడా వెళ్లలేదు. ఇప్పుడు ఇంత సడెన్‌గా పరామర్శ కార్యక్రమాన్ని పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. పైకి పరామర్శలా అనిపిస్తున్నా కూడా దీని వెనుక రాజకీయ కారణాలేవో ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
చంద్రబాబు కుటుంబాలను చీల్చి రాజకీయ కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించిన కొన్ని గంటలకే పరామర్శల పేరిట కేసీఆర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అవకుండా చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ షర్మిల వచ్చినా టీడీపీ, జనసేనలను కలవకుండా ఎలా అడ్డుకోవాలని భావిస్తున్నారా? షర్మిల ప్రభావం ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలపై ఏ మేరకు ఉంటుంది? వంటి విషయాలపై చర్చించేందుకే పరామర్శ పేరుతో కేసీఆర్‌ను జగన్ కలుస్తున్నారా? అనే విషయాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి కేసీఆర్‌తో ఏదో డీల్ సెట్ చేసుకోవడానికే జగన్ కలుస్తున్నారంటూ జనం చర్చించుకుంటున్నారు.