వినేవాడికి చెప్పేవాడు లోకువ అని.. వినేవాడు ఉంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నైనా చెబుతారు. ఈ మధ్య కాలంలో ఆయనతో పాటు వైసీపీ నేతలంతా జనసేన అధినేతపై పడ్డారు. అప్పట్లో టీడీపీని విమర్శించి ఇప్పుడు టీడీపీకి మద్దతు ఎలా ఇస్తున్నారని.. చంద్రబాబుని ఎలా సమర్థిస్తున్నారంటూ ప్రశ్నలు వేస్తున్నారు. వీరికి దిమ్మతిరిగేలా జగన్ రాజకీయ జీవితం మొత్తాన్ని ఐదే ఐదు నిమిషాల్లో వివరించి ఆ వీడియోను సోషల్ మీడియాలోకి వదిలారు జనసేన అభిమానులు. గత ఎన్నికలలో టీడీపీని విమర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే టీడీపీకి మద్దతుగా ఎలా నిలబడ్డారు? అదే చంద్రబాబుని ఎలా సమర్థిస్తున్నారు? ఈ వీడియో ముఖ్యంగా జగన్ ఇచ్చిన హామీలను.. చేసిన కామెంట్స్‌ను.. స్టేట్‌మెంట్స్‌ను మాట మార్చిన విధానాన్ని ఏకిపారేశారు.
వైసీపీ నేతలకు దిమ్మ తిరుగుతోంది..!
ఈ వీడియో తనకు ఎంపీగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలపడంతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మొదలు.. వైఎస్సార్ మరణానంతరం జగన్ చేసిన ప్రకటనలు.. రాహుల్‌ను ప్రధానిని చేస్తాననడం.. సోనియా గురించి ఆయన పలికిన చిలక పలుకులు అన్నీ ఉన్నాయి. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన ఇండియన్ కాంగ్రెస్‌ను ఇటాలియన్ కాంగ్రెస్ అనడం.. నియంత అనగానే అందరికీ సోనియా గాంధీ గుర్తొస్తుందనడం.. పొగిడిన నోటితోనే తెగడటం వంటివన్నీ వీడియోలో చేర్చారు. అది చూసిన వైసీపీ నేతలకు దిమ్మ తిరుగుతోంది. సమర్థించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. తన తండ్రిని రెండు సార్లు సీఎంని చేసిన పార్టీని..తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీని జగన్ ఏ విధంగా తూలనాడారో వీడియో చూస్తే అర్థమవుతుంది.
బీజేపీ గురించి ఏం మాట్లాడారు?
వాగు దాటే వరకూ ఓడ మల్లన్న.. దాటగానే బోడి మల్లన్న అన్నట్టుగా జగన్ వ్యవహరించారని.. ఇంతకు మించి మాట తప్పడం.. మడమ తిప్పడం మరొకటి ఉంటుందా? అని జనం అంటున్నారు. అలాగే ఎన్నికలకు ముందు బీజేపీ గురించి ఏం మాట్లాడారు? ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఎలా దాసోహమయ్యారనేది కూడా ఆ వీడియోలో ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా అన్నారు. పోలవరం, అమరావతే రాజధాని అనడం, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, మద్య నిషేధం ఇలా వంద హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదు. ఇవన్నీ యూటర్న్ తీసుకోవడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇవన్నీ చూశాక పవన్ యూటర్న్ పెద్ద విషయమేమీ కాదు.. మీ యూటర్న్ చూసి వైసీపీ నేతలు యూటర్న్ తీసుకోవాలంటూ వివరించారు. జగన్ చిల్లర రాజకీయాలు కట్టబెట్టకుంటే ఇంకా చిక్కుల్లో పడే అవకాశం ఉందన్నట్టుగా ఈ వీడియో ఉంది.