ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఎన్నికల ముందే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఈ సమయంలోనే తనకు నచ్చిన రీతిలో సినిమాలు తీయించి వదులుతుంటారు.. ఈ సమయంలోనే ఎన్నికల హామీలన్నీ గుర్తుకొస్తాయి. ఈ హామీల్లో ఒకటి వైఎస్సార్ పెన్షన్ కానుక. నేడు దీనికి జగన్ ముహూర్తం పెట్టారు. సామాజిక భద్రతా పెన్షన్‌లను రూ.250 పెంచి మరీ కాకినాడలో పంపిణీ చేయనున్నారు. నాడు అంటే జగన్ అధికారంలోకి వచ్చిన సమయంలో పెన్షన్‌లను రూ.3000 చేస్తామని చెప్పారు. కానీ చేసిందే లేదు. సడెన్‌గా ఇప్పుడు అవ్వాతాతలు గుర్తొచ్చారు జగన్‌కు. నాలుగేళ్లుగా పెంచకుండా ఇప్పుడు జగన్ పెంచుతున్నారు.
అది కూడా చేసింది లేదు..!
గతంలో ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు టీడీపీ పెన్షన్‌ను రూ.2వేలు చేసిందని పదే పదే విమర్శించిన జగన్ ఇప్పుడు చేస్తున్నది అదే కదా? అని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇలా ఒక విషయంలో కాదు.. ప్రతి ఒక్క విషయంలోనూ అదే చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు అవ్వా తాతలకు 3 వేల రూపాయల పెన్షన్ ను నెలనెలా 1వ తేదీనే జగన్ అందిస్తామన్నారు. కానీ అది కూడా చేసింది లేదు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రూ.250 పెంచారు. మూడో ఏడాది మరో రూ.250 పెంచారు. గత ఏడాది మరో రూ.200.. ఇప్పుడు రూ.250 పెంచుతున్నారు. మొత్తానికి దశల వారీగా పెంచేసి ఇక అవ్వాతాతలకు ఏదో మేలు చేసేసినట్టు కవరింగ్స్ ఇస్తున్నారు.
ఎప్పుడు జంప్ చేస్తారో తెలియదు..!
అటు సామాజిక న్యాయం అనే అంశం జగన్‌కు ఇప్పుడే గుర్తొచ్చింది. ఇటు చూస్తే పెన్షన్‌ల అంశం.. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదన్న విషయమూ ఇప్పుడే తెలిసింది. ఇలా కొత్తగా ఎన్నికల ముందు చాలా అంశాలు గుర్తొస్తున్నాయి. మొత్తానికి అన్ని విషయాలు ఆయనకు వ్యతిరేకమవుతుంటే ఏం చేయాలో పాలుపోక ఏదో ఒకటి చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. రాజకీయ సలహాలిచ్చే ప్రశాంత్ కిషోర్ వెంట లేరు. వెన్నంటి ఉంటారనుకున్న నేతలు ఎప్పుడు ఎటు జంప్ చేస్తారో తెలియకుండా ఉంది. ఇలా అన్నీ సమస్యలు చుట్టుముట్టి ఓ అభద్రతాభావంతో జగన్ కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది.